IPL 2025: బోణీ కోసం బరిలోకి గుజరాత్ టైటాన్స్ , ముంబై ఇండియన్స్- ఎవరి రికార్డు ఎలా ఉంది?
MI vs GT: ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్ లో తలపడనున్నాయి. మ్యాచ్ సాయంత్రం 7:30 కి. రెండు జట్లు తమ తొలి విజయం కోసం ఎదురు చూస్తున్నాయి.

MI vs GT హెడ్ టు హెడ్ రికార్డ్: నేడు IPLలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు అహ్మదాబాద్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు ఈ సీజన్‌లో మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఒక విజయాన్ని కూడా నమోదు చేసుకోలేదు. తొలి విజయం కోసం తహతహలాడిపోతున్నాయి.
ముంబై ఇండియన్స్ (MI) తన మొదటి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో ఆడి 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. శుభ్మన్ గిల్ (Shubman Gill) నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ (GT) పంజాబ్ కింగ్స్ (PBKS)తో తొలి మ్యాచ్ ఆడి ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు బలంగా ఉంది? ఇప్పటివరకు రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది?
ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ హెడ్ టు హెడ్ రికార్డ్
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు 5 సార్లు పోటీ పడ్డాయి. ముంబై ఇండియన్స్‌పై మూడుసార్లు గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ 2 సార్లే నెగ్గింది. అంటే ఇక్కడ ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ పైచేయి సాధిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ అహ్మదాబాద్‌లో ఎలాంటి ఆటతీరు ప్రదర్శిస్తోందో చూడాలి. గతంలో హార్దిక్ పాండ్యా 2 సీజన్లకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఆ జట్టును శుభ్మన్ గిల్ నడిపిస్తున్నాడు.
రెండు జట్లలో ఇదే బెస్ట్ స్కోర్
ముంబై ఇండియన్స్ (Mumbai Indians)పై గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) చేసిన అత్యధిక స్కోర్ 233 పరుగులు. గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ చేసిన అత్యధిక స్కోర్ 218 పరుగులు. అత్యల్ప స్కోర్లు చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ ఓసారి 168 పరుగులు మాత్రమే చేసింది. ముంబై ఇండియన్స్ అయితే 152 పరుగులు చేసింది. గత సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 6 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్ వ్యవహరించాడు. గతంలో స్లోఓవర్ రేటు కారణంగా రెగ్యులర్ కెప్టెన్‌పై హార్దిక్ పాండ్యాపై నిషేధం ఉంది. అందుకే ఓపెనింగ్ మ్యాచ్‌ను హార్దిక్ పాండ్యాకు బదులు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా చేశాడు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలనుఅందుకుంటాడు.
కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు ఏంటీ?
హార్దిక్ పాండ్యా ముందు గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. తన కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్‌గా నిలిపాడు. గత సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉంటున్నాడు. హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో 45 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తే 26 మ్యాచ్‌ల్లో ఆ జట్టు గెలిచింది. అంటే 57.77 శాతం మ్యాచ్‌ల్లో గెలిచాడు.
ప్లేయింగ్ XI అంచనాలు
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికె), శుభమన్ గిల్ (సి), రాహుల్ తెవాటియా, ఆర్ సాయి కిషోర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (WK), విల్ జాక్స్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (c), మిచెల్ సాంట్నర్, నమన్ ధీర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.