Virat Kohli Supremacy: కోహ్లీ సుప్రీమసీ.. బౌన్సర్ తో కవ్విస్తే, సిక్సర్ తో బదులిచ్చిన విరాట్.. వైరలవుతున్న వీడియో
కోహ్లీని కవ్విస్తే ఎలా గుంటుందో చెన్నైతో మ్యాచ్ లో రుచి చూపించాడు. బౌన్సర్ వేసి, తనను రెచ్చగొట్టాలని చూసిన బౌలర్ పతిరాణకు సరైన గుణపాఠం నేర్పాడు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
IPL 2025 CSK VS RCB Updates: చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్థాయికి తగ్గట్లుగాా ఆడలేకపోయాడు. 30 బంతుల్లో 31 పరుగులు చేసి, ఫ్యాన్ ను కాస్త నిరుత్సాహానికి లోను చేశాడు. నిజానికి ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి చేపాక్ పిచ్ పై కోహ్లీ ఇబ్బంది పడ్డాడు. బంతిని సరిగ్గా టైమ్ చేయలేక పోయాడు. అయితే ఇన్నింగ్స్ 11వ ఓవర్లో మాత్రం మేజిక్ జరిగింది. అప్పటివరకు సాదాసీదాగా ఆడుతున్న కోహ్లీ.. ఒక్కసారిగా తన సుప్రీమసీని చూపించాడు.
ఈ ఓవర్ ను స్లింగ్ యాక్షన్ బౌలర్ మతీషా పతిరాణ బౌల్ చేశాడు. తొలి బంతిని బౌన్సర్ వేయగా.. అది నేరుగా కోహ్లీ హెల్మెట్ కు తాకింది. దీంతో కంగారు పడిన ఆర్సీబీ ఫిజియో నేరుగా మైదానంలోకి వచ్చి కంకషన్ గురించి కోహ్లీని పరిశీలించాడు. ఆ తర్వాత కోహ్లీ మాత్రం నేరుగా రెండో బంతిని ఎదుర్కోడానికి సిద్ధమయ్యాడు. రెండో బంతిని కూడా పతిరాణ బౌన్సర్ వేయగా, అప్పటికే మంచి పోజిషన్ లోకి వచ్చిన కోహ్లీ.. దాన్ని సిక్సర్ గా మలిచాడు. దీంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరలైంది. అభిమానులు ఈ పోస్టును షేర్లు, లైకులు చేస్తూ తమకు తోచిన కామెంట్లు పెడుతున్నారు.
ఛార్జ్ అయిన కోహ్లీ..
ఇక అప్పటివరకు నత్త నడకగా ఆడిన కోహ్లీ తర్వాతి బంతిని మిడ్ వికెట్ దిశగా చిప్ షాట్ ఆడి బౌండరీ సాధించాడు. దీంతో అతని స్ట్రైక్ రేట్ వందకు చేరుకుంది. అయితే తన జోరును అలాగే కొనసాగించాలని భావించిన కోహ్లీకి సీఎస్కే స్పిన్నర్ నూర్ అహ్మద్ షాకిచ్చాడు. అతని బౌలింగ్ స్లాగ్ స్వీప్ షాట్ ఆడగా, అది నేరుగా వెళ్లి ఫీల్డర్ చేతుల్లో పడింది. దీంతో కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసింది. ఏదేమైనా షార్ప్ బౌన్సర్ తో కోహ్లీలోని ఆటగాడిని పత్తిరాణ రెచ్చగొట్టాడని, అందుకు తగిన ఫలితాన్ని అనుభవించాడని కోహ్లీ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
17 ఏళ్ల తర్వాత గెలిచిన ఆర్సీబీ..
ఈ సీజన్ లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో దుర్భేధ్యంగా కనిపిస్తున్న ఆర్సీబీ.. సీజన్ లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. అలాగే సీఎస్కే సొంతగడ్డ చేపాక్ స్టేడియంలో 17 ఏళ్ల తర్వాత నెగ్గి, ఆత్మ విశ్వాసాన్ని నింపుకుంది. ఎప్పుడో 2008లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో చేపాక్ లో గెలిచిన ఆర్సీబీ.. గత 16 ఏళ్లుగా ఈ ఫీట్ నమోదు చేయలేక పోయింది. అయితే ఈసారి కొత్త కెప్టెన్ రజత్ పతిదార్ సారథ్యంలో మాత్రం తన సొంతగడ్డపై సీఎస్కేను మట్టి కరిపించింది.