Just In





Ravindra Jadeja Records: రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్, ఐపీఎల్ చరిత్రలోనే ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనత
CSK vs RCB Records | సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు.

IPL 2025 RCB vs CSK | చెన్నై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) భారీ తేడాతో ఓటమిపాలైంది. దాదాపు 16 ఏళ్ల తరువాత చెన్నై వేదిక మీద సీఎస్కే మీద ఆర్సీబీ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఆర్ రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. చెన్నై చెపాక్‌లో సీఎస్కే ప్లేయర్ అరుదైన ఘనత సాధించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో 3,000 పరుగులు చేయడంతో పాటు 100 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ప్లేయర్ జడేజా 25 పరుగులు చేయడం ద్వారా ఈ మైలురాయిని చేరుకున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్ రౌండర్లో ఒకడు మాత్రమే కాదు. వరల్డ్‌లో బెస్ట్ ఫీల్డర్లలో ఒకడిగా జడేజా సత్తా చాటాడు. ఆర్సీబీతో పదహారేళ్ల తరువాత చెన్నైలో ఓడిన మ్యాచ్ లో జడేజా స్పిన్ మాయాజాలం పనిచేయలేదు. జడేజా 3 ఓవర్లు వేసి వికెట్ లేకుండానే 37 పరుగులు ఇచ్చాడు.
రవీంద్ర జడేజాకు కెరీర్‌లో మైలురాయి
ఆల్ రౌండ్ ప్రతిభతో IPL చరిత్రలో అరుదైన ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. శుక్రవారం రాత్రి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 25 పరుగులకు చేరుకోగానే ఐపీఎల్ కెరీర్ లో 3,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మరోవైపు లీగ్ చరిత్రలో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడిగా జడేజా సరికొత్త చరిత్ర లిఖించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 30.76 సగటు, 7.64 ఎకానమీ రేటుతో 160 వికెట్లు పడగొట్టాడు. సీఎస్కేకు ఆడుతూ 133 వికెట్లు సాధించాడు. డ్వేన్ బ్రావో 140 వికెట్ల తరువాత రెండో స్థానంలో నిలిచాడు జడేజా.
నెరవేరిన ఆర్సీబీ కల, సీఎస్కేక్ బిగ్ షాక్
చెపాక్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 50 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. కాగా, చెన్నై వేదికలో 2008లో సీఎస్కే మీద ఆర్సీబీ గెలిచింది. ఆ తరువాత 17 ఏళ్లలో చెన్నై గడ్డ మీద ఆర్సీబీ నెగ్గడం ఇదే తొలిసారి. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 196/7 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ 32 బంతుల్లో 51 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
197 పరుగుల లక్ష్యంతో దిగిన సీఎస్కే బ్యాటర్లు తడబాటుకు లోనయ్యారు. సీఎస్కే నిర్నీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయ్యాడు. ఆర్సీబీ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ 3 వికెట్లు తీయగా, యష్ దయాల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి చెన్నైని ఇబ్బంది పెట్టారు. దాంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థి చెన్నై గడ్డపై 17 ఏళ్లకు చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.