IPL 2023 Winner: ఐపీఎల్ 2023 ఫైనల్ లో గుజరాత్ పై అద్భుతమైన విజయాన్ని అందుకుని ఐదో సారి కప్పు అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. 16వ ఐపీఎల్ లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది చెన్నై తన సత్తాను మరోసారి చాటింది. చివరి ఓవర్లో రవీంద్ర జడేజా అద్భుతమైన ఆటతీరుతో సీఎస్కేను విజయ తీరాలకు చేర్చాడు. అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఫుల్ థ్రిల్లింగ్ ను అందించింది.
ఈ ఉత్కంఠ భరిత పోరుపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా స్పందించారు. ఆయన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండాలనుకుంటామో అచ్చంగా అలాగే థ్రిల్లింగ్ నే ఈ మ్యాచ్ అందించింది అనే అర్థంలో ఇది అసలైన ఫైనల్ అని సుందర్ పిచాయ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఐపీఎల్ ఎప్పట్లాగే చాలా అద్భుతంగా ఉందన్నారు. సీఎస్కేకు శుభాభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది గుజరాత్ టైటాన్స్ టీమ్ మరింత బలంగా పుంజుకుని వస్తుంది చెప్పుకొచ్చారు.
5 వికెట్ల తేడాతో విజయం
మే 28 ఆదివారం రోజున ఐపీఎల్ ఫైనల్ జరగాల్సింది. కానీ వర్షం వల్ల ఒక్క ఓవర్ కూడా పడలేదు. దాంతో రిజర్వ్ డే అయిన సోమవారం రోజు మ్యాచ్ జరిగింది. ఉత్కంఠ మధ్య అత్యంత హోరాహోరిగా సాగి ఆఖరి బంతికి ఫలితం తేలిన మ్యాచ్ లో చెన్నై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 214 పరుగుల భారీ స్కోరు చేసింది. సాయి దర్శన అద్భుతమైన ఆటతో 96 పరుగులు చేశాడు. వృద్ధిమాన్ సాహా(54), గిల్(39) రాణించడంతో భారీ స్కోర్ చేసింది గుజరాత్.
ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన చెన్నై 3 బంతులు ఆడగానే వర్షం పడింది. రెండున్నర గంటలకుపైగా విరామం వచ్చింది. తిరిగి ఆట ఆరంభమయ్యాక లక్ష్యాన్ని డక్ వర్త్ లూయిస్ ప్రకారం 15 ఓవర్లలో 171గా సవరించారు. చెన్నై ఓపెనర్లు తొలి బంతి నుంచే విధ్వంసం చేశారు. దొరికిన బంతిని దొరికినట్లే బౌండరీకి తరలించారు. రషీద్ ఖాన్ ను కూడా చెన్నై బ్యాటర్లు ధీటుగా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత స్పిన్నర్ నూర్ అహ్మద్ ఒకే ఓవర్ లో చెన్నై ఓపెనర్లను ఔట్ చేశాడు.
ఐదోసారి ఐపీఎల్ కప్పు అందుకున్న సీఎస్కే..!
20 బంతుల్లో 51 పరుగులు చేయాల్సిన పరిస్థితి. దూబె, రాయుడు అలవోకగా బౌండరీలు సాధించడంతో చెన్నైకి 15 బంతుల్లో 23 పరుగులు కావాల్సిన పరిస్థితి. ఆ తర్వాత మోహిత్ తన బౌలింగ్ తో రాయుడు(19), ధోని(0)ని ఔట్ చేసి పెవిలియన్ కు పంపించాడు. అక్కడి నుంచి గుజరాత్ బౌలింగ్ తో పట్టుబిగించగా.. ఆట గుజరాత్ వైపు మళ్లింది. చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సిన పరిస్థితి. క్రీజ్ లో జడేజా ఉన్నాడన్న ధీమా చెన్నైలో ఉంది. కానీ ఆఖరి ఓవర్లో మొదటి నాలుగు బంతులకు కట్టుదిట్టంగా వేశాడు మోహిత్. చివరి 2 బంతుల్లో 10 పరుగులు రావాల్సిన పరిస్థితి. ఐదో బంతికి జడేజా సిక్స్ బాదాడంతో చెన్నై అబిమానుల్లో ఆశలు చిగురించాయి. చివరి బంతిని బౌండరీగా తరలించడంతో చెన్నై విజయాన్ని అందుకుని ఐదో సారి ఐపీఎల్ కప్పు అందుకుంది.