ఐపీఎల్ కెరీర్‌కు అంబటి రాయడు గుడ్‌బై చెప్పాడు. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్సే తన చివరి మ్యాచ్ అని, మరోసారి యూటర్న్ తీసుకునేది లేదని ఇంతకు ముందే స్పష్టం చేశాడు. ఫైనల్స్‌లో కీలకమైన సమయంలో వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్ కూడా ఆడాడు. రాయడు గురించి తనతో ఉన్న పరిచయం నుంచి మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.


కామెంటేటర్ హర్షా భోగ్లేతో సంభాషణ సందర్భంగా రాయుడు గురించి ధోని మాట్లాడుతూ... ‘రాయుడులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అతను ఫీల్డ్‌లో ఉన్నప్పుడు తన 100 శాతం ఇస్తాడు. కానీ రాయుడు జట్టులో ఉంటే నేనెప్పటికీ ఫెయిర్ ప్లే అవార్డు గెలవలేను (నవ్వుతూ). అతను దేనికైనా చాలా త్వరగా రియాక్ట్ అవుతాడు. నేను రాయుడుతో ఎప్పటినుంచో కలిసి ఆడుతున్నాను. ఇండియా-ఏ టూర్స్ దగ్గర నుంచి మేం కలిసి ఆడుతున్నాం. పేస్, స్పిన్ రెండిటినీ బాగా ఆడగల అతి కొద్ది మందిలో రాయుడు ఒకడు. అది నిజంగా చాలా ప్రత్యేకమైనది. అతను కూడా అచ్చం నాలానే. ఫోన్ ఎక్కువగా ఉపయోగించడు. తన జీవితంలో తర్వాతి దశను రాయుడు బాగా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.’ అన్నాడు.


ఫైనల్ మ్యాచ్‌లో జట్టు ప్రదర్శనపై కూడా ధోని స్పందించాడు. ‘ఇవాళ మా ఆటలో కొన్ని లోపాలు ఉన్నాయి. బౌలింగ్ విభాగం ప్రదర్శన బాలేదు. కాబట్టి బ్యాటింగ్ విభాగంపై అదనపు భారం పడింది.’ అన్నాడు. మ్యాచ్‌లో ఎప్పుడూ కామ్‌గా, కూల్‌గా ఉండటంపై మాట్లాడాడు. ‘నాకు కూడా కోపం వస్తుంది. అది మానవ లక్షణం. కానీ నేను ఎదుటి వారి స్థానంలో కూడా ఉండి ఆలోచిస్తాను. ఒత్తిడిలో ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రవర్తిస్తారు. అజింక్య రహానే, కొంత మందికి చాలా అనుభవం ఉంది. కాబట్టి మనం వారి గురించి ఆలోచించనక్కర్లేదు.’ అన్నాడు.


ఐపీఎల్ సీజన్‌కు అద్భుతమైన ఫినిష్ లభించింది. ఒక ఓవర్‌కు ముందు మ్యాచ్ చెన్నై చేతిలో ఉంటే,  తర్వాతి ఓవర్‌కు గుజరాత్‌ వైపు. చివరి ఐదు ఓవర్లలో అయితే బోలెడన్ని మలుపులు ఉన్నాయి. ఒకానొక దశలో కేవలం ఐదు బంతుల్లోనే 28 పరుగులు వచ్చాయి. కానీ వెంటనే రెండు బంతుల్లో రెండు వికెట్లు పడ్డాయి. చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు కావాల్సిన దశలో మొదటి నాలుగు బంతుల్లో మోహిత్ శర్మ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాతి రెండు బంతులను రవీంద్ర జడేజా సిక్సర్, ఫోర్ కొట్టడంతో మ్యాచ్, టైటిల్ రెండూ చెన్నై ఖాతాలో పడ్డాయి. అంత ఒత్తిడిలో కూడా జడేజా అద్బుతమైన ఆటతీరే చెన్నైకి ట్రోఫీని అందించింది.


ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా చెన్నై టార్గెట్‌ను 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. చెన్నై చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (96: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వృద్ధిమాన్ సాహా (54: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీ సాధించాడు. చెన్నై బ్యాటర్లలో డెవాన్ కాన్వే (47: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) అత్యధిక పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా (15 నాటౌట్: 6 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఒత్తిడిలో మ్యాచ్‌ను గెలిపించాడు.