MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఎప్పుడు? ఫ్యాన్స్‌ను వెంటాడుతున్న ప్రశ్న ఇదే. మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. కెప్టెన్‌గా ఐదో ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న అనంతరం మహేంద్ర సింగ్ ధోనిని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే  ఈ ప్రశ్న అడిగారు.


దీనిపై ధోని స్పందిస్తూ ‘మీకు సమాధానం కావాలా? పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుంటే నేను రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం. కానీ ఇక్కడ అందరూ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నాకు అన్నిటికంటే సులభమైనది ఇప్పుడే రిటైర్మెంట్ ప్రకటించి తప్పుకోవడం, అన్నిటికంటే కష్టమైనది మరో తొమ్మిది నెలలు కష్టపడి మరో ఐపీఎల్ ఆడటానికి ప్రయత్నించడం. మరో ఐపీఎల్ ఆడటం నాకు కానుక లాంటిది. కానీ నా శరీరానికి మాత్రం అంత సులభం కాదు. కాబట్టి మరో ఆరేడు నెలలు గడిస్తే కానీ దీని గురించి ఏమీ చెప్పలేను. క్రికెట్ ప్రేమికులు చూపించే ప్రేమ నాకు గిఫ్ట్ లాంటిది.’ అన్నాడు.


గేమ్‌లో ఎమోషనల్ అవ్వడంపై కూడా మాట్లాడాడు. ‘అందరూ ఎమోషనల్ అవుతారు. చెపాక్ స్టేడియంలో చివరి మ్యాచ్ ఆడేటప్పుడు అందరూ నా పేరు మంత్రంలా జపిస్తున్నారు. నాకు కంటి నిండా నీరు వచ్చాయి. దీంతో వెంటనే డగౌట్‌లోకి వెళ్లిపోయాను. దీన్ని ఎంజాయ్ చేయాలని అప్పుడే అనుకున్నాను. నేను నాలా ఉంటాను కాబట్టే వారు నన్ను ఇష్టపడుతున్నారు. నేను చాలా గ్రౌండెడ్‌గా ఉంటాను. నేనెప్పుడూ నాలా కాకుండా మరోలా ఉండటానికి ప్రయత్నించను.’ అన్నాడు.


నేటి మ్యాచ్‌లో జట్టు ప్రదర్శనపై కూడా ధోని స్పందించాడు. ‘ఇవాళ మా ఆటలో కొన్ని లోపాలు ఉన్నాయి. బౌలింగ్ విభాగం ప్రదర్శన బాలేదు. కాబట్టి బ్యాటింగ్ విభాగంపై అదనపు భారం పడింది.’ అన్నాడు. మ్యాచ్‌లో ఎప్పుడూ కామ్‌గా, కూల్‌గా ఉండటంపై మాట్లాడాడు. ‘నాకు కూడా కోపం వస్తుంది. అది మానవ లక్షణం. కానీ నేను ఎదుటి వారి స్థానంలో కూడా ఉండి ఆలోచిస్తాను. ఒత్తిడిలో ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రవర్తిస్తారు. అజింక్య రహానే, కొంత మందికి చాలా అనుభవం ఉంది. కాబట్టి మనం వారి గురించి ఆలోచించనక్కర్లేదు.’ అన్నాడు.




ఐపీఎల్ సీజన్‌కు అద్భుతమైన ఫినిష్ లభించింది. చివరి ఐదు ఓవర్లలో బోలెడన్ని మలుపులు కనిపించాయి. చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు కావాల్సిన దశలో మొదటి నాలుగు బంతుల్లో మోహిత్ శర్మ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాతి రెండు బంతులను రవీంద్ర జడేజా సిక్సర్, ఫోర్ కొట్టడంతో మ్యాచ్, టైటిల్ రెండూ చెన్నై ఖాతాలో పడ్డాయి.


ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా చెన్నై టార్గెట్‌ను 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. చెన్నై చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (96: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వృద్ధిమాన్ సాహా (54: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీ సాధించాడు. చెన్నై బ్యాటర్లలో డెవాన్ కాన్వే (47: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) అత్యధిక పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా (15 నాటౌట్: 6 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఒత్తిడిలో మ్యాచ్‌ను గెలిపించాడు.