Gujarat Titans vs Chennai Super Kings Final: ఐపీఎల్ సీజన్‌కు అద్భుతమైన ఫినిష్. ‘షాకులు, ట్విస్టులు, ఝలక్కులు, ప్రతీ సీన్ క్లైమ్యాక్స్‌లా ఉంటది...’ ఈ మ్యాచ్‌కు ఇవన్నీ సరిగ్గా సరిపోతాయి. బంతి, బంతికీ మారిన సమీకరణాలు. ఈ ఓవర్‌కు ముందు మ్యాచ్ చెన్నై చేతిలో ఉంటే,  తర్వాతి ఓవర్‌కు గుజరాత్‌ వైపు. చివరి ఐదు ఓవర్లలో అయితే బోలెడన్ని మలుపులు. ఒకానొక దశలో ఐదు బంతుల్లో 28 పరుగులు వచ్చాయి. కానీ వెంటనే రెండు బంతుల్లో రెండు వికెట్లు. ఇంత కంటే డ్రామా ఎక్కడైనా ఉంటుందా? వీటన్నిటినీ దాటి చెన్నై కప్పును కొట్టింది. చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు కావాల్సిన దశలో మొదటి నాలుగు బంతుల్లో మోహిత్ శర్మ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాతి రెండు బంతులను రవీంద్ర జడేజా సిక్సర్, ఫోర్ కొట్టడంతో మ్యాచ్, టైటిల్ రెండూ చెన్నై ఖాతాలో పడ్డాయి. అంత ఒత్తిడిలో కూడా జడేజా అద్బుతమైన ఆటతీరే చెన్నైకి ట్రోఫీని అందించింది.


ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా చెన్నై టార్గెట్‌ను 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. చెన్నై చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (96: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వృద్ధిమాన్ సాహా (54: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీ సాధించాడు. చెన్నై బ్యాటర్లలో డెవాన్ కాన్వే (47: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) అత్యధిక పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా (15 నాటౌట్: 6 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఒత్తిడిలో మ్యాచ్‌ను గెలిపించాడు.


సమిష్టిగా రాణించిన చెన్నై
15 ఓవర్లకు 171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (26: 16 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), డెవాన్ కాన్వే (47: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే నాలుగు ఓవర్లలోనే చెన్నై వికెట్ కోల్పోకుండా 52 పరుగులు సాధించింది. వీరు మొదటి వికెట్‌కు 74 పరుగులు జోడించారు. అయితే నూర్ అహ్మద్ చెన్నైను గట్టి దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేలను అవుట్ చేసి చెన్నైని గట్టి దెబ్బ కొట్టాడు.


కానీ తర్వాత వచ్చిన శివం దూబే (32 నాటౌట్: 21 బంతుల్లో, రెండు సిక్సర్లు), అజింక్య రహానే (27: 13 బంతుల్లో,  రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) పరుగుల వేగాన్ని మాత్రం తగ్గనివ్వలేదు. ముఖ్యంగా అజింక్య రహానే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్లు నష్టపోయి 112 పరుగులు చేసింది. ఈ దశలో చెన్నై సూపర్ కింగ్స్‌ను మోహిత్ దెబ్బ కొట్టాడు. 11వ ఓవర్లో ఫాంలో ఉన్న రహానేను అవుట్ చేశాడు. దీంతో ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న అంబటి రాయుడు (19: 8 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) క్రీజులోకి వచ్చాడు. రషీద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ చివరి రెండు బంతులకు శివం దూబే రెండు సిక్సర్లు కొట్టాడు. మోహిత్ శర్మ వేసిన తర్వాతి ఓవర్లో మొదటి మూడు బంతులను రాయుడు 6, 4, 6గా మలిచాడు. కానీ వెంటనే మోహిత్ చెన్నైని చావు దెబ్బ కొట్టాడు. వరుస బంతుల్లో రాయుడు, మహేంద్ర సింగ్ ధోనిలను (0: 1 బంతి) అవుట్ చేశాడు. షమీ వేసిన 14వ ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి ఓవర్లో ఒత్తిడిని జయించిన జడేజా (15 నాటౌట్: 6 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్) చెన్నైకి కప్ అందించాడు.


సాయి సుదర్శన్ షో
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌కు మంచి భాగస్వామ్యాలు లభించాయి. మొదటి మూడు వికెట్లకు 50కు పైగా భాగస్వామ్యాలను గుజరాత్ బ్యాటర్లు ఏర్పరిచారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (39: 20 బంతుల్లో, ఏడు ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (54: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి బంతి నుంచే వేగంగా ఆడారు. వీరి ఆటతో గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. అయితే ఏడో ఓవర్లో గిల్‌ను అవుట్ చేసి జడేజా మొదటి వికెట్ తీసుకున్నాడు.


ఆ తర్వాత వృద్ధిమాన్ సాహాకు వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (96: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు)  జత కలిశాడు. వీరు రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే వృద్ధిమాన్ సాహా అవుటయ్యాడు. క్రీజులో కుదురుకున్న సాయి సుదర్శన్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (21: 12 బంతుల్లో, రెండు సిక్సర్లు) అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. వీరు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. సెంచరీకి నాలుగు పరుగుల ముంగిట మతీష పతిరనా బౌలింగ్‌లో సాయి సుదర్శన్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది.