చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. వర్షం తగ్గిపోయినా ప్రాక్టీస్ పిచ్ మీద విపరీతంగా నీరు చేరడంతో గేమ్ ప్రారంభం అవ్వడం లేట్ అయింది. మొత్తానికి మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుందో అంపైర్లు ప్రకటించారు.


అర్థరాత్రి 12:10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఓవర్ల సంఖ్యను 15కు కుదించారు. చెన్నై లక్ష్యాన్ని 171కి సవరించారు. ప్రస్తుతం చెన్నై 0.3 ఓవర్లలో నాలుగు పరుగులు చేసింది. అంటే మిగిలిన 14.3 ఓవర్లలో 167 పరుగులు చేయాల్సి ఉంది. కొట్టాల్సిన రన్‌రేట్ దాదాపు 11కు పైగానే ఉంది. పవర్ ప్లే కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే. ఒక బౌలర్ కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌల్ చేయగలడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌కు మంచి భాగస్వామ్యాలు లభించాయి. మొదటి మూడు వికెట్లకు 50కు పైగా భాగస్వామ్యాలను గుజరాత్ బ్యాటర్లు ఏర్పరిచారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (39: 20 బంతుల్లో, ఏడు ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (54: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి బంతి నుంచే వేగంగా ఆడారు. వీరి ఆటతో గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. అయితే ఏడో ఓవర్లో గిల్‌ను అవుట్ చేసి జడేజా మొదటి వికెట్ తీసుకున్నాడు.


ఆ తర్వాత వృద్ధిమాన్ సాహాకు వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (96: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు)  జత కలిశాడు. వీరు రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే వృద్ధిమాన్ సాహా అవుటయ్యాడు. క్రీజులో కుదురుకున్న సాయి సుదర్శన్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (21: 12 బంతుల్లో, రెండు సిక్సర్లు) అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. వీరు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. సెంచరీకి నాలుగు పరుగుల ముంగిట మతీష పతిరనా బౌలింగ్‌లో సాయి సుదర్శన్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది.


గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ


గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
జాషువా లిటిల్, కేఎస్ భరత్, ఒడియన్ స్మిత్, సాయి కిషోర్, శివం మావి


చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ


చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
శివం దూబే, మిషెల్ శాంట్నర్, సుభ్రాంషు సేనాపతి, షేక్ రషీద్, ఆకాష్ సింగ్