Most Runs In IPL Final: ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 29వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతోంది. ముందుగా రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ మే 28వ తేదీన జరగాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా ఇప్పుడు ఈ మ్యాచ్ రిజర్వ్ డేలో జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేశ్ రైనా పేరిట ఉంది.
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 10వ సారి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటి వరకు ఫైనల్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సురేష్ రైనా పేరిట ఉంది. రైనా ఫైనల్‌లో రెండు హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌లతో సహా 35.57 సగటుతో మొత్తం 249 పరుగులు చేశాడు. ఈ జాబితాలో చెన్నై జట్టు మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ రెండో స్థానంలో ఉన్నాడు.
షేన్ వాట్సన్ IPL చరిత్రలో నాలుగు సార్లు ఫైనల్ మ్యాచ్ ఆడాడు, ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌తో మొత్తం 236 పరుగులు చేశాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. అతను ఇప్పటివరకు 6 IPL ఫైనల్ మ్యాచ్‌లు ఆడాడు. 30.50 సగటుతో మొత్తం 183 పరుగులు చేశాడు.
ఆరో స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ
ఐపీఎల్ చరిత్రలో 10వ సారి మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఇప్పటి వరకు 8 సార్లు బ్యాటింగ్ చేసిన ధోని ఇందులో 36 సగటుతో మొత్తం 180 పరుగులు చేశాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో బ్యాట్‌తో ధోని ఆటతీరు చూసుకుంటే 11 ఇన్నింగ్స్‌లో 104 పరుగులు చేశాడు. 34.67 సగటుతో ఈ పరుగులు సాధించాడు. ఈ సమయంలో ధోని ఎనిమిది ఇన్నింగ్స్‌లలో అజేయంగా నిలిచాడు. ఈ సీజన్‌లో ధోని అత్యధిక స్కోరు 32 నాటౌట్‌గా ఉంది.