First Ball Ducks In IPL, Return Of AB de Villiers Virat Kohli Bares All In Interview WATCH: క్రికెట్ తనకు చూపించాల్సినవన్నీ చూపించేస్తోందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటున్నాడు. ఇలా డకౌట్లు కావడం తన కెరీర్లో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నాడు. ఏబీ డివిలియర్స్‌ను తానెంతో మిస్ అవుతున్నానని చెబుతున్నాడు. ఆర్సీబీ ఇన్‌సైడర్ మిస్టర్ నాగ్స్ (డానిష్ సైత్)కు ఇచ్చిన ముఖాముఖిలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
ఐపీఎల్ 2022లో విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా త్వరగా ఔటవుతున్నాడు. 2022కు ముందు ఐపీఎల్ కెరీర్లో మూడుసార్లు డకౌట్ అయితే ఈ ఒక్క సీజన్లోనే మూడుసార్లు డకౌట్‌గా మారాడు. మే 8న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులోనూ సున్నాకే వెనుదిరిగాడు.
'ఇలా నాకెప్పుడూ జరగలేదు. నాకు తెలిసి నా కెరీర్ మొత్తంలో ఇలాంటివి చూడలేదు. అందుకే నవ్వుకుంటూ వెళ్లిపోతున్నాను. ఆట చూపించాల్సిన ప్రతిదీ నేను చూస్తున్నానని అనిపిస్తోంది' అని కోహ్లీ అన్నాడు. 'ఫస్ట్‌బాల్ డక్స్ అవుతున్నా. రెండోసారి డకౌట్ అయినప్పుడు నీలాగే (మిస్టర్ నాగ్స్) నిస్సహాయంగా అనిపించింది. ఇలాంటిది నా కెరీర్లో ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు నేను క్రికెట్లో అన్నీ చూశాను. సుదీర్ఘంగా క్రికెట్ ఆడుతున్నాను. అందుకే అన్నీ చూసేశాను' అని విరాట్ చెప్పాడు.
మీకైమైనా పెట్స్ ఉన్నాయా అని నాగ్స్ అడిగిన ప్రశ్నకు విరాట్ నో అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. 'అదేంటీ, మీకు మూడు డక్స్ ఉన్నాయిగా' అని నాగ్స్ అనడంతో ఇద్దరూ నవ్వుల్లో మునిగితేలారు. ఇతరుల అభిప్రాయాలు, విమర్శలకు తాను దూరంగా ఉంటానని కోహ్లీ చెప్పాడు. ఎందుకంటే తాను అనుభవించేది, తానెలా ఫీలయ్యేది వారికి తెలియదు కదా అని ప్రశ్నించాడు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ గురించి ప్రశ్నించగా అతడినెంతో మిస్సవుతున్నానని అన్నాడు. వచ్చే ఏడాది ఏదో ఒక పాత్రలో అతడు ఆర్సీబీలో చేరతాడని ధీమా వ్యక్తం చేశాడు.
'నేను ఏబీడీని చాలా మిస్సవుతున్నా. నేనతడితో రెగ్యులర్‌గా మాట్లాడతాను. గోల్ఫ్ చూసేందుకు ఈ మధ్యే తన కుటుంబంతో అమెరికాకు వెళ్లాడు. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రదర్శనను బాగా గమనిస్తున్నాడు. ఏదో విధంగా వచ్చే ఏడాది అతడు జట్టులో చేరతాడని అనుకుంటున్నా' అని విరాట్ అన్నాడు.