డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు మరో బిగ్ షాక్! కీలక ఆటగాడు, మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా పూర్తిగా ఐపీఎల్‌కు దూరమవుతున్నాడు. ఈ సీజన్లో అతడిక మ్యాచులు ఆడడని తెలుస్తోంది. గాయం కారణంగా అతడు జట్టుకు దూరమవుతున్నాడని సమాచారం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచులో ఫీల్డింగ్ చేస్తుండగా రవీంద్ర జడేజా అప్పర్ బాడీకి గాయమైంది. దాంతో ఆ తర్వాతి జరిగిన దిల్లీ మ్యాచులో అతడికి విశ్రాంతినిచ్చారు. రెండు మూడు రోజులుగా జడ్డూ గాయాన్ని సీఎస్‌కే వైద్యబృందం జాగ్రత్తగా పర్యవేక్షిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గాయం నయం కాలేదు. ఇదే సమయంలో గురువారం ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనుంది.
కీలకమైన ఈ మ్యాచులో రవీంద్ర జడేజా సేవలు ఎంతో అవసరం. అయినప్పటికీ సీజన్లో ప్లేఆఫ్స్ చేరుకొనే అవకాశాలు లేకపోవడంతో అతడిని రిస్క్‌లో పెట్టొద్దని యాజమాన్యం నిర్ణయం తీసుకుందని తెలిసింది. పైగా ఆర్సీబీ లేదా రాజస్థాన్ రాయల్స్‌లో ఎవరో ఒకరు 16 పాయింట్లు సాధిస్తే సీఎస్‌కేకు ఉన్న అవకాశాలు ముగిసిపోతాయి. దాంతో జడ్డూ ఇక సీజన్ మొత్తానికీ దూరమైనట్టేనని ఫ్రాంచైజీ వర్గాలు అంటున్నాయి.
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలను మొదట ఎంఎస్ ధోనీయే చూసుకున్నాడు. సడెన్‌గా తాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. రవీంద్ర జడేజా ఇకపై జట్టును నడిపిస్తాడని వెల్లడించాడు. ఒకరిద్దరు ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం, వరుస పెట్టి మ్యాచుల్లో ఓడిపోవడంతో జడ్డూ కెప్టెన్సీని వదిలేశాడు. తిరిగి ధోనీకి అప్పగించాడు. ఆ తర్వాత సీఎస్‌కే భారీ స్కోర్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్ గెలవడంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచుల్లో 75 సగటు, 145 స్ట్రైక్‌రేట్‌తో 227 పరుగులు చేశాడు. అలాగే 26 సగటు, 7.06 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. 10 మ్యాచుల్లో 19 సగటు, 118 స్ట్రైక్‌రేట్‌తో 116 పరుగులు చేశాడు. బంతితోనూ రాణించలేదు. 5 వికెట్లే పడగొట్టాడు.