LSG vs GT, KL Rahul: పుణెలోని ఎంసీయే క్రికెట్‌ పిచ్‌ కాస్త కఠినంగా ఉందని లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అంటున్నాడు. క్రికెట్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నాడు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నాం కాబట్టి ఇబ్బందేమీ లేదన్నాడు. నాకౌట్లో కాకుండా ఇప్పుడే ఇలా ఓడినందుకు సంతోషంగా ఉందని వెల్లడించాడు. పాఠాలు నేర్చుకొనేందుకు ఉపయోగపడుతుందని చెప్పాడు. గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచులో ఓటమి తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.


'వికెట్‌ ట్రికీగా అనిపించింది. మేం ఇక్కడ ఆడిన చివరి 2-3 మ్యాచుల్లోనూ ఇలాగే ఉంది. తక్కువ టార్గెట్‌ ఛేదిస్తున్నామని తెలుసు. పిచ్‌ కఠినంగా ఉందని కాబట్టి అదేమీ సులభం కాదని తెలుసు. మేం చాలా బాగా బౌలింగ్‌ చేశాం. ఎలాంటి పిచ్‌పై అయినా ప్రత్యర్థిని 150  కన్నా తక్కువకే పరిమితం చేయడం గొప్ప విషయం. మా బౌలర్లు అద్భుతంగా బంతులేశారు. మేం మరింత బాగా బ్యాటింగ్‌ చేయాల్సింది. షాట్ల ఎంపిక బాగాలేకపోవడం, రనౌట్లు కావడం గెలుపును దూరం చేశాయి. ఇది మాకో మంచి గుణపాఠం. ఇలాంటి ఓటముల నుంచి మేం ఎంతో నేర్చుకుంటాం' అని రాహుల్‌ అన్నాడు.


'కొన్ని సార్లు మనమేంటో గుర్తు చేయడానికి ఇలాంటి మ్యాచులు ఉపయోగపడతాయి. మరింత మెరుగ్గా రాణించేందుకు సాయం చేస్తాయి. తక్కువ టార్గెట్లు ఛేదిస్తున్నప్పుడ పవర్‌ప్లేను ఉపయోగించుకోవాలి. నేనూ, డికాక్‌ జట్టుకు శుభారంభం ఇవ్వాలని అనుకున్నాం. 60 కాకున్నా వికెట్లు పోకుండా 35 లేదా 45 రన్స్‌ చేయాలని భావించాం. పిచ్‌ గ్రిప్‌ అవుతుంది కాబట్టి పవర్‌ ప్లే తర్వాత పరుగులు చేయడం కష్టం అవుతుంది. గుజరాత్‌ స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు చేయడం కష్టమే. ఇలాంటి కఠినమైన పిచ్‌లపై మంచి ప్రత్యర్థుల మీద పరుగులు చేసేందుకు మేం దారులు వెతకాలి. ఈ ఓటమి ద్వారా మేం నేర్చుకోవాల్సిన పాఠం అదే' అని రాహుల్‌ పేర్కొన్నాడు.


ఐపీఎల్‌ 2022లో మ్యాచ్‌ 57లో గుజరాత్‌ టైటాన్స్‌ అదరగొట్టింది. అత్యల్ప స్కోరును రక్షించుకుంది. 145 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ను 13.5 ఓవర్లకే 82కే ఆలౌట్‌ చేసింది. 62 రన్స్‌ తేడాతో గెలిచేసింది. 18 పాయింట్లతో ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఛేదనలో దీపక్‌ హుడా (27; 26 బంతుల్లో 3x4) టాప్‌ స్కోరర్‌. బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ 4 వికెట్లు పడగొట్టాడు. యశ్‌ దయాల్‌, సాయి కిషోర్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు గుజరాత్‌లో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ (63*; 49 బంతుల్లో 7x4) హాఫ్‌ సెంచరీ చేశాడు. రాహుల్‌ తెవాతియా (22*; 16 బంతుల్లో 4x4)  డేవిడ్‌ మిల్లర్‌ (26; 24 బంతుల్లో 1x4, 1x6) రాణించారు.