LSG vs GT, Highlights:


ఐపీఎల్‌ 2022లో మ్యాచ్‌ 57లో గుజరాత్‌ టైటాన్స్‌ అదరగొట్టింది. అత్యల్ప స్కోరును రక్షించుకుంది. 145 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ను 13.5 ఓవర్లకే 82కే ఆలౌట్‌ చేసింది. 62 రన్స్‌ తేడాతో గెలిచేసింది. 18 పాయింట్లతో ఈ సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఛేదనలో దీపక్‌ హుడా (27; 26 బంతుల్లో 3x4) టాప్‌ స్కోరర్‌. బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ 4 వికెట్లు పడగొట్టాడు. యశ్‌ దయాల్‌, సాయి కిషోర్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు గుజరాత్‌లో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ (63*; 49 బంతుల్లో 7x4) హాఫ్‌ సెంచరీ చేశాడు. రాహుల్‌ తెవాతియా (22*; 16 బంతుల్లో 4x4)  డేవిడ్‌ మిల్లర్‌ (26; 24 బంతుల్లో 1x4, 1x6) రాణించారు.


గుణ పాఠం నేర్చుకుంటారా?


మోస్తరు టార్గెట్‌, డిఫికల్ట్‌ పిచ్‌, బలమైన బౌలింగ్‌ అటాక్‌. అయినా సరే, గ్రేట్‌ డెప్తున్న బ్యాటింగ్‌ లైనప్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ఛాన్స్‌ ఉంటుందనే అనుకున్నారు! కానీ ఈ ట్రికీ టార్గెట్‌ను ఛేదించడంలో ఆ జట్టు విఫలమైంది. బంతికో పరుగు చేసి అప్పుడప్పుడూ బౌండరీలు కొడితే గెలిచే స్కోరును ఛేదించలేకపోయింది. చెత్త షాట్లు, తొందరపాటుతో ఓటమి పాలైంది. జట్టు 19 వద్దే డికాక్‌ (11)ను యశ్‌ దయాల్‌ ఔట్‌ చేశాడు. పవర్‌ప్లేలో వేసిన తన మూడో ఓవర్లో రాహుల్‌ (8)ను ప్రెజర్‌ చేసిన షమీ అతడి వికెట్‌ సాధించాడు. దీపక్‌ హుడా ఎక్కువసేపే క్రీజులో మిగతావాళ్లు నిలవలేదు. అనవసరంగా ఒత్తిడికి లోనై స్టంపౌట్లు, క్యాచౌట్లు, రనౌట్లు అయ్యారు. కృనాల్‌ పాండ్య (5), ఆయుష్ బదోనీ (8)ని సాహా స్టంపౌట్‌ చేశాడు. హుడాత్ సమన్వయ లోపంతో స్టాయినిస్‌ (2) రనౌట్‌ అయ్యాడు. హోల్డర్‌ (1) రషీద్‌ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు. దాంతో లక్నో ఓటమి ఖరారైపోయింది.


ఫామ్ లోకి గిల్


టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 8 వద్దే వృద్ధిమాన్‌ సాహా (5)ను మొహిసన్‌ ఖాన్‌ ఔట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూహెడ్‌ (10) ఆకట్టుకోలేదు. అవేశ్‌ఖాన్‌ అతడిని పెవిలియన్‌ పంపించాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (11)నూ అతడే ఔట్‌ చేశాడు. అప్పటికి గుజరాత్‌ స్కోరు 51. పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తున్న పరిస్థితుల్లో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ మాత్రం అదరగొట్టాడు. నిలకడగా బ్యాటింగ్‌ చేశాడు. అందివచ్చిన బంతుల్నే బౌండరీకి పంపించి హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. డేవిడ్‌ మిల్లర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 52 (41 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరు 103 వద్ద మిల్లర్‌ను ఔట్‌చేయడం ద్వారా హోల్డర్‌ విడదీశాడు. ఆఖర్లో రాహుల్‌ తెవాతియా, గిల్‌ కలిసి 24 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యంతో  జట్టు స్కోరును 144/4కు చేర్చారు.