LSG vs GT, 1 innings highlights: ఐపీఎల్ 2022లో మ్యాచ్ 57లో గుజరాత్ టైటాన్స్ తక్కువ స్కోరే చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌కు 145 పరుగుల మోస్తరు టార్గెట్ ఇచ్చింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై లక్నో బౌలర్లు దుమ్మురేపారు. పరుగులివ్వకుండా ప్రత్యర్థిని నియంత్రించారు. టైటాన్స్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (63*; 49 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీ చేశాడు. రాహుల్ తెవాతియా (22*; 16 బంతుల్లో 4x4) డేవిడ్ మిల్లర్ (26; 24 బంతుల్లో 1x4, 1x6) ఫర్వాలేదనిపించారు.
ఫామ్ లోకి గిల్
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 8 వద్దే వృద్ధిమాన్ సాహా (5)ను మొహిసన్ ఖాన్ ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూహెడ్ (10) ఆకట్టుకోలేదు. అవేశ్‌ఖాన్ అతడిని పెవిలియన్ పంపించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య (11)నూ అతడే ఔట్ చేశాడు. అప్పటికి గుజరాత్ స్కోరు 51. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తున్న పరిస్థితుల్లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మాత్రం అదరగొట్టాడు. నిలకడగా బ్యాటింగ్ చేశాడు. అందివచ్చిన బంతుల్నే బౌండరీకి పంపించి హాఫ్ సెంచరీ అందుకున్నాడు. డేవిడ్ మిల్లర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 52 (41 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరు 103 వద్ద మిల్లర్‌ను ఔట్‌చేయడం ద్వారా హోల్డర్ విడదీశాడు. ఆఖర్లో రాహుల్ తెవాతియా, గిల్ కలిసి 24 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యంతో జట్టు స్కోరును 144/4కు చేర్చారు.