Rajasthan Royals vs Punjab Kings: ఐపీఎల్ 2023లో బుధవారం (ఏప్రిల్ 5వ తేదీ) జరిగిన మ్యాచ్‌లో ధృవ్ జురెల్ అనే పేరు ఎక్కువగా వార్తల్లో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి క్షణాల్లో ధ్రువ్ బ్యాటింగ్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ రాజస్థాన్ రాయల్స్‌ను దాదాపు గెలిపించినంత పని చేశాడు.


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా రాజస్థాన్ రాయల్స్ 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి ఓటమి అంచున నిలిచింది. ఇక్కడ నుంచి గెలవాలంటే రాజస్థాన్‌కు 30 బంతుల్లో 74 పరుగులు అవసరం. ఇది దాదాపు అసాధ్యంగా అనిపించింది. ఇక్కడ, ధృవ్ జురెల్, షిమ్రన్ హెట్‌మేయర్‌తో కలిసి 27 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. పంజాబ్ నుంచి మ్యాచ్‌ను దాదాపుగా దూరం చేశారు. హెట్‌మేయర్ రనౌట్ తర్వాత మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లో నుండి జారిపోయింది.


రాజస్థాన్‌కు మరో ఫినిషర్
ఇక్కడ ధృవ్ జురెల్ 15 బంతుల్లో 32 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. అతను ఇంపాక్ట్ ప్లేయర్‌గా రంగంలోకి దిగాడు. అతను నిజంగా ఇక్కడ ఇంపాక్ట్ చూపించే ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ శిబిరం కూడా అతని సంచలన ప్రవేశంతో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫినిషర్ పాత్రను చక్కగా పోషించగల మరొక విధ్వంసక బ్యాట్స్‌మన్‌ని రాజస్తాన్ పొందింది.


ధృవ్ జురెల్ ఎంట్రీ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్‌కు మరింత డెప్త్‌ను ఇచ్చింది. ఇప్పుడు ఈ జట్టులో తొమ్మిదో ఆర్డర్ వరకు బ్యాటింగ్ చేయగల వారు కనిపిస్తున్నారు. రాజస్థాన్ స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ దాడి ఇప్పటికే సమతుల్యమైంది. ఇటువంటి పరిస్థితిలో ఈ సమయంలో ఈ జట్టు చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది.


ధ్రువ్ జురెల్ ఎవరు?
ధ్రువ్ జురెల్ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఆటగాడు. ప్రస్తుతం అతడి వయసు 22 ఏళ్లు మాత్రమే. అతను అండర్-19 ప్రపంచ కప్ 2020లో భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇక్కడ ముంబై ఇండియన్స్‌కు చెందిన తిలక్ వర్మ, రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన యశస్వి జైస్వాల్ అతని సహచర ఆటగాళ్లు. ఆ ప్రపంచకప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్ 2022 మెగా వేలంలో రాజస్థాన్ అతన్ని రూ. 20 లక్షల బేస్ ధరతో తమ జట్టులో భాగంగా చేసుకుంది. అతను గత సీజన్‌లో రాజస్థాన్ జట్టులో కూడా భాగమయ్యాడు. అయితే అతనికి అరంగేట్రం చేసే అవకాశం రాలేదు.


ధ్రువ్ జురెల్ 2022 ఫిబ్రవరిలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 14 ఇన్నింగ్స్‌ల్లో 48.91 సగటుతో 587 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ధృవ్ జురెల్ ఫాస్ట్ బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ పాత్రను పోషిస్తున్నాడు. అతను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహేంద్ర సింగ్ ధోని, ఏబీ డివిలియర్స్‌ల అభిమాని. ఈ ఇద్దరినీ ఆదర్శంగా భావించి అతను తన క్రికెట్ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.