Most Runs in IPL: ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ సారథి శిఖర్ ధావన్ రేర్ ఫీట్ సాధించాడు. ఈ లీగ్‌లో ఫిఫ్టీ ప్లస్ స్కోర్లను 50 సార్లు చేసిన మూడో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ లో డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీల తర్వాత ఈ ఘనతను అందుకున్న మూడో బ్యాటర్‌గా రెండో భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
రాజస్తాన్ రాయల్స్‌తో బుధవారం గువహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లోనే 7 బౌండరీలు, 3 భారీ సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్ లో గబ్బర్‌కు ఇది 48వ హాఫ్ సెంచరీ. కానీ ఈ లీగ్ లో ధావన్ పేరిట రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ఐపీఎల్ లో 50+ స్కోర్లు చేసిన మూడో బ్యాటర్ గా పంజాబ్ కింగ్స్ సారథి నిలిచాడు.
ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఓపెనర్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథిగా ఉన్న డేవిడ్ వార్నర్ అందరికంటే ముందున్నాడు. వార్నర్.. ఇప్పటివరకు ఐపీఎల్‌లో 164 మ్యాచ్‌లు ఆడి 164 ఇన్నింగ్స్‌లలో 60 సార్లు 50+ స్కోర్లు సాధించాడు. ఇందులో 56 హాఫ్ సెంచరీలుండగా నాలుగు సెంచరీలున్నాయి. రెండో స్థానంలో ఉన్న కోహ్లీ.. ఇటీవలే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లీ.. 224 మ్యాచ్‌లలో 216 ఇన్నింగ్స్ ఆడి 50 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేశాడు. కోహ్లీకి ఐపీఎల్ లో 45 అర్థ శతకాలు, ఐదు సెంచరీలూ ఉన్నాయి.
పరుగుల జాబితాలోనూ టాప్..
ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో కూడా గబ్బర్ టాప్ - 2లో ఉన్నాడు. ఈ లీగ్ లో విరాట్ కోహ్లీ.. 216 ఇన్నింగ్స్ లలో ద 6,706 పరుగులు చేయగా రెండో స్థానంలో ఉన్న ధావన్.. 208 ఇన్నింగ్స్ లలో 6,370 రన్స్ సాధించాడు. ఈ క్రమంలో ఇద్దరి సగటు దాదాపు (36) సేమ్ గా ఉంది. ఇక ఈ జాబితాలో వార్నర్ (5,974), రోహిత్ శర్మ (5,880), సురేశ్ రైనా (5,162) లు టాప్ - 5లో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని.. ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఆఖర్లో వచ్చి రెండు భారీ సిక్సర్లు బాదడం ద్వారా ఐపీఎల్ లో తన పరుగుల ప్రయాణాన్ని ఐదు వేల మైలురాయిని దాటించాడు. ధోని.. 236 మ్యాచ్ లలో 208 ఇన్నింగ్స్ ఆడి 5,004 పరుగులు చేశాడు. ధోని ఖాతాలో 24 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇక నిన్న గువహతిలోని బర్సపర వేదికగా రాజస్తాన్ - పంజాబ్ మధ్య ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఐదు పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో రాజస్తాన్ చివరి బంతి వరకూ పోరాడి విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచింది. 20 ఓవర్లలో రాజస్తాన్.. ఏడు వికెట్లు కోల్పోయి 192 రన్స్ చేసింది.