Sanju Samson IPL 2023: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో సంజూ శాంసన్‌ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. చిన్న వయసులోనే లెజెండ్స్‌ సరసన నిలిచాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర లిఖించాడు. అజింక్య రహానె రికార్డును వెనక్కి నెట్టేశాడు. బర్సాపార స్టేడియంలో బుధవారం పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచులో సంజూ 25 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. దీంతో అతడు ఆల్‌టైమ్‌ టాప్‌ రన్‌ గెట్టర్‌ లిస్టులో చేరిపోయాడు.




ఇప్పటి వరకు రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున సంజూ శాంసన్ 118 మ్యాచులు ఆడాడు. 30.46 సగటు, 138 స్ట్రైక్‌రేట్‌తో 3138 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 18 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అంతకు ముందు ఆర్‌ఆర్‌కు అజింక్య రహానె 106 మ్యాచుల్లో 35.60 సగటు, 122.30 స్ట్రైక్‌రే‌ట్‌తో 3098 రన్స్‌ సాధించాడు. షేన్‌ వాట్సన్‌, జోస్‌ బట్లర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.


సంజూ శాంసన్‌ 2013 నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతున్నాడు. అరంగేట్రం నుంచే సత్తా చాటాడు. ద్రవిడ్‌ నాయకత్వంలో దాటుదేలాడు. ఐపీఎల్‌లో తొలి ట్రోఫీ గెలిచింది రాజస్థాన్‌. ఆ తర్వాత 2013లో ద్రవిడ్‌ కెప్టెన్సీలో ప్లేఆఫ్ చేరింది. రెండేళ్లు జట్టును నిషేధించడంతో సంజూను దిల్లీ క్యాపిటల్స్‌ తీసుకుంది. అక్కడా అదరగొట్టాడు. 2018 వేలంలో శాంసన్‌ను రాజస్థాన్‌ తిరిగి దక్కించుకుంది. ముంబయి ఇండియన్స్‌తో పోటీపడి మరీ రూ.8 కోట్లు చెల్లించింది. 2021లో స్టీవ్‌ స్మిత్‌ నుంచి అతడు కెప్టెన్సీ తీసుకున్నాడు. 2022లో ఏకంగా రన్నరప్‌గా నిలబెట్టాడు. 2008 తర్వాత తొలిసారి ఫైనల్‌కు తీసుకెళ్లాడు.




రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌టైమ్‌ టాప్‌ స్కోరర్లు


సంజూ శాంసన్‌ : 3138 పరుగులు (118 మ్యాచులు)
అజింక్య రహానె: 3098 పరుగులు (106 మ్యాచులు)
షేన్‌ వాట్సన్‌ : 2474 పరుగులు (84 మ్యాచులు)
జోస్‌ బట్లర్‌ : 2378 పరుగులు (60 మ్యాచులు)
రాహుల్‌ ద్రవిడ్‌ : 1324 పరుగులు (52 మ్యాచులు)


 ఐపీఎల్ 2023లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఐదు పరుగులతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 197 పరుగులు సాధించింది. అనంతరం రాజస్తాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. షిమ్రన్ హిట్‌మేయర్ (36: 18 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), ధ్రువ్ జోరెల్ (32 నాటౌట్: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లో శిఖర్ ధావన్ (86 నాటౌట్: 56 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.