Kane Williamson Injury: ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 16లో ఒక్క మ్యాచ్ కూడా పూర్తిగా ఆడకముందే గాయపడి ఏకంగా సీజన్ నుంచి తప్పుకున్న న్యూజిలాండ్ సారథి (పరిమిత ఓవర్లకు) కేన్ విలియమ్సన్ ఐపీఎల్ తో పాటు ఆ దేశ క్రికెట్ జట్టుకూ షాకిచ్చాడు. మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్న కేన్ మామకు సర్జరీ తప్పదని వైద్యులు తేల్చడంతో అతడు ఈ ఏడాది నుంచి భారత్ వేదికగా జరగాల్సి ఉన్న వన్డే వరల్డ్ కప్ లో ఆడేది అనుమానంగానే ఉంది.
తాజా రిపోర్టుల ప్రకారం.. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకే విలియమ్సన్ సిద్ధపడ్డాడని.. అయితే ఈ ప్రక్రియ జరగడానికి కనీసం ఆరు నుంచి ఏడు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నందున అతడు అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో ఆడేది దాదాపు అనుమానమేనని సమాచారం. ఇదే విషయమై బ్లాక్ క్యాప్స్ (కివీస్ అధికారిక ట్విటర్ ఖాతా) నేడు ట్విటర్ లో ఓ ట్వీట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది.
సీఎస్కేతో మ్యాచ్ లో గాయపడ్డ తర్వాత వైద్యులు అతడికి స్కానింగ్ నిర్వహించగా.. ఇందులో కుడి మోకాలి ఎముక ఛిద్రం అయినట్టు తేలింది. స్కాన్స్ తర్వాత కేన్ విలియమ్సన్ కుడి మోకాలికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తేల్చడంతో అతడు సర్జరీ చేయించుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
కివీస్ కు ఎదురుదెబ్బే..
ఇప్పటికిప్పుడు ఆపరేషన్ జరిగినా కేన్ మామ కోలుకోవడానికి తక్కువలో తక్కువ ఆరు నుంచి ఏడు నెలలు పట్టే అవకాశముంది. ఆ తర్వాత కూడా విలియమ్సన్ మళ్లీ ఫిట్నెస్ నిరూపించుకుని తిరిగి గ్రౌండ్ లో అడుగుపెట్టడం కూడా అతిశయోక్తే. దీంతో అక్టోబర్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో అతడు ఆడే ఛాన్స్ లేనట్లే. ఇది కివీస్ జట్టుకు ఎదురుదెబ్బే. 2019లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కేన్ మామ అటు సారథిగానే గాక బ్యాటర్ గా కూడా రాణించాడు. ఇంగ్లాండ్ లో జరిగిన గత వరల్డ్ కప్ లో 9 ఇన్నింగ్స్ లలో 578 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది కూడా కేన్ సారథ్యంలోనే కివీస్ వన్డే ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఇది ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బే.
ఏం జరిగింది..?
ఐపీఎల్-16లో భాగంగా మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన టోర్నమెంట్ ఓపెనర్ లో సీఎస్కే బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేసిన విలిమయ్సన్.. అదుపు తప్పి బౌండరీ లైన్ ఆవల పడ్డాడు. కింద పడే క్రమంలో అతడి కాలు నేలకు బలంగా తాకింది. దీంతో హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజుల క్రితమే విలియమ్సన్.. న్యూజిలాండ్ కు చేరుకున్నాడు.