Jos Buttler Injury: 


రాజస్థాన్‌ రాయల్స్‌కు షాక్‌! ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ గాయపడ్డాడు. అతడి ఎడమచేతి చిటికెన వేలికి దెబ్బ తగిలింది. పరీక్షించిన వైద్యులు కుట్లు వేశారు. దాంతో కీలకమైన దిల్లీ మ్యాచుకు అతడు అందుబాటులో ఉండడని తెలిసింది. దీనిపై రాజస్థాన్‌ రాయల్స్‌ అధికారికంగా సమాచారం ఇవ్వలేదు.


బర్సాపారా వేదికగా బుధవారం రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచులో జోస్‌ బట్లర్‌ ఓ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. జేసన్ హోల్డర్‌ బౌలింగ్‌లో పంజాబ్‌ హిట్టర్‌ షారుఖ్‌ ఖాన్‌ భారీ షాట్‌ ఆడాడు. గాల్లోకి లేచిన బంతిని అందుకొనేందుకు డీప్‌లో ఉన్న జోస్‌ బట్లర్‌ వేగంగా ముందుకు పరుగెత్తాడు. తన వద్దకు క్యారీ అవ్వకపోయినా ఒక కాలిని మడిచి మోకాలిపై ముందుకు జారి బంతి అందుకున్నాడు. అప్పటికే తడిచిపోయిన బంతి సీమ్‌కు చీలికలు వచ్చింది. దాంతో అతడి చేతికి గాయమైంది.




బట్లర్‌ గాయపడటంతోనే ఛేదనలో యశస్వీ జైశ్వాల్‌తో కలిసి రవిచంద్రన్‌ అశ్విన్‌ను రాజస్థాన్‌ ఓపెనింగ్‌కు పంపించింది. అయితే బట్లర్‌ ఆలస్యంగా వచ్చి 19 రన్స్‌ చేశాడు. అతడు గాయపడ్డ విషయాన్ని కెప్టెన్‌ సంజూ శాంసన్‌ మీడియాకు చెప్పాడు.


'బట్లర్‌కు చిన్న గాయమైంది. ఫీల్డింగ్‌ చేస్తుండగా చేతికి దెబ్బ తగిలింది. కుట్లు వేసేందుకు ఫిజియోకు ఎక్కువ టైమ్‌ దొరకలేదు. అందుకే రవిచంద్రన్‌ను ముందుగా పంపించాం. అతనికిప్పుడు బాగానే ఉంది. కుట్లు వేశారు. బ్యాటింగ్‌ బాగానే చేశాడు. ఫిట్‌గానే ఉన్నాడు' అని సంజూ శాంసన్‌ అన్నాడు.


'ఇలాంటి మ్యాచుల్లో మూమెంట్స్‌ వేగంగా మారుతుంటాయి. మాకు శుభారంభమే దక్కింది. మధ్యలో కొన్ని బౌండరీలు కొట్టాలని అనుకున్నాం. కానీ అనుకున్నప్పుడు కొట్టలేకపోయాం. అక్కడే వెనకబడిపోయాం. అయినప్పటికీ టార్గెట్‌ను మేం సమీపించాం. ఇంకొన్ని బౌండరీలు లభించివుంటే గెలిచేవాళ్లం' అని శాంసన్‌ వివరించాడు.


ఈ మ్యాచులో బెస్ట్‌ క్యాచ్‌ అవార్డు జోస్‌ బట్లర్‌కే దక్కింది. ఆ అవార్డు చెక్కు అందుకొనేందుకు బట్లరే స్వయంగా వచ్చాడు. అప్పుడు అతడి చిటికెన వేలికి బ్యాండేడ్‌ వేసి వుంది. బహుశా అతడికి ఒకటి లేదా రెండు మ్యాచుల్లో విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.