Best Average In T20 Format: పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. డెవాన్ కాన్వే 52 బంతుల్లో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అయినప్పటికీ అతను సెంచరీని చేయలేకపోయాడు. కానీ మహేంద్ర సింగ్ ధోని జట్టు భారీ స్కోరును చేరుకోవడంలో గణనీయమైన సహకారం అందించాడు. కనీసం 5,000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో డెవాన్ కాన్వే సగటు అత్యుత్తమంగా ఉంది. న్యూజిలాండ్, చెన్నై సూపర్ కింగ్స్‌లకు ఆడే ఈ బ్యాటర్ ఇప్పటివరకు T20 ఫార్మాట్‌లో 44.41 సగటుతో పరుగులు చేశాడు.


రెండో స్థానంలో బాబర్
ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం రెండో స్థానంలో ఉన్నాడు. బాబర్ ఆజం టీ20 ఫార్మాట్‌లో 44.02 సగటుతో పరుగులు సాధించాడు. పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ మూడో స్థానంలో ఉన్నాడు. మహ్మద్ రిజ్వాన్ టీ20 ఫార్మాట్‌లో 43.95 సగటుతో పరుగులు సాధించాడు.


భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ టీ20 ఫార్మాట్‌లో 42.31 సగటుతో పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. భారత మాజీ కెప్టెన్ టీ20 ఫార్మాట్‌లో 41.05 సగటుతో పరుగులు సాధించాడు.


ఐపీఎల్‌ 2023 సీజన్ 41వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను పంజాబ్ కింగ్స్ ఓడించింది. చివరి బంతి వరకు థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఒత్తిడితో పాటు మ్యాచ్‌ను కూడా జయించింది. ఈ హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్ కింగ్స్ 201 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించింది. చెపాక్ స్టేడియంలో అత్యధిక లక్ష్య ఛేదన ఇదే కావడం విశేషం.


పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా కృష్టి చేశారు. ప్రభ్ సిమ్రన్ సింగ్ (42: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లియాం లివింగ్‌స్టోన్ (40: 24 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. మరోవైపు సీఎస్కే బ్యాటర్లలో ఓపెనర్ డెవాన్ కాన్వే (92 నాటౌట్: 52 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇది డెవాన్ కాన్వేకు ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఎప్పటిలానే చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ మ్యాచ్‌లో కూడా మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (37: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), డెవాన్ కాన్వే (92 నాటౌట్: 52 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్) బౌండరీలతో చెలరేగారు. దీంతో ఆరు ఓవర్ల పవర్‌ ప్లే ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.ఆ తర్వాత కూడా వీరు వేగంగా ఆడారు. మొదటి వికెట్‌కు 86 పరుగులు జోడించిన అనంతరం సికందర్ రాజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రుతురాజ్ గైక్వాడ్ స్టంపౌట్ అయ్యాడు.