CSK Vs GT IPL 2024 First Innings: ఇప్పటికిప్పుడు ఎలిమినేట్ కాకూడదంటే తప్పక గెలిచి తీరవలసిన మ్యాచ్‌లో గుజరాత్ ఛాలెంజింగ్ టోటల్ పోస్ట్ చేసింది.  ఓపెనర్లు ఇద్దరూ... సెంచరీలతో  చెలరేగడంతో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ 231 పరుగుల భారీ స్కోరు చేసి చెన్నైకి సవాలు విసిరింది.  మ్యాచ్‌లో గెలవాలంటే చెన్నై 232 పరుగులు చేయాల్సి ఉంది. 


సెంచరీల రికార్డ్


గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ 104(54), సుదర్శన్ 103(51)  ఇద్దరూ సెంచరీలు చేశారు.  ఐపీఎల్ చరిత్రలో గతంలో కేవలం ఒకేసారి నమోదైన రికార్డిది. 2019లో ఎస్ఆర్‌‌హెచ్ ఓపెనర్లు బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్‌లు సెంచరీలు చేశారు. 


210 పరుగుల పార్టనర్ షిప్ కూడా రికార్డే..


తొలి వికెట్‌కు 210 పరుగుల పార్ట్‌నర్ షిప్ నెలకొల్పిన గుజరాత్ ఓపెనర్లు ఈ ఫీట్ సాధించిన రెండో జంటగా రికార్డులకెక్కారు. గతంలో 2022లో లక్నో సూపర్ జెయింట్స్ టీం ఓపెనర్లు కేఎల్ రాహుల్, డికాక్ ‌లు మొదటి వికెట్‌కు అజేయంగా కచ్చితంగా 210 పరుగులే చేశారు. 


గుజరాత్ ఇన్నింగ్స్ సాగిందిలా..  


తొలి ఓవర్ నుంచే అటాకింగ్‌గా ఆడిన శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ అయిదో బంతికే సిక్సర్ బాదాడు. తొలి ఓవర్‌లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో గుజరాత్ టీమ్ 14 పరుగులు చేసింది. మూడో ఓవర్ నుంచి సిక్సర్లు షురూ చేసిన సాయి సుదర్శన్.. దూకుడుగా ఆడటం కొనసాగించి 32 బంతులకు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు అవకాశమివ్వకుండా ఇద్దరూ దొరికిన ప్రతి బంతినీ బౌండరీకి పంపుతూ రెచ్చిపోయారు. సిక్సర్‌తో 25 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్ ఆ తరువాత గేర్ మార్చాడు. ఇద్దరూ పోటీ పడుతూ దొరికిన ప్రతి లూస్ బాల్‌ని బౌండరీ లైన్ దాటించారు.  ఇద్దరూ కచ్చితంగా 50 బంతులకే సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే ఇద్దరూ తుషార్ దేశ్ పాండే వేసిన 17వ ఓవర్‌లో ఔటయ్యారు. 210 పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యానికి సుదర్శన్ ఔటవ్వడంతో బ్రేక్ పడింది. తుషార్ వేసిన 17వ ఓవర్ రెండో బంతిని మిస్ టైమ్ చేసిన సుదర్శన్ శివమ్ దూబేకు చేతికి చిక్కాడు. ఆ ఓవర్ చివరి బంతికి గిల్ కూడా సిక్స్ కొట్టబోయి బౌండరీ వద్ద రవీంద్ర జడేజాకి చిక్కాడు.


250 పక్కా అనుకున్నారు కానీ.. 


ఓపెనర్లిద్దరూ డిస్మిస్ అయ్యాక క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్, షారుఖ్ ఖాన్‌లు వాళ్లిచ్చిన మూమెంటమ్‌ను అందుకోలేక పోయారు. దీంతో తరువాతి మూడు ఓవర్లలో కేవలం 22 పరుగులే వచ్చాయి. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి షారుఖ్ ఖాన్ రనౌటయ్యాడు.  గుజరాత్‌ని చివరి అయిదు ఓవర్లలో కేవలం 41 రన్స్ కే కట్టడి చేసిన చెన్నై భారీ స్కోరు పోస్టు చేయకుండా అడ్డుకుంది. 15 ఓవర్లు పూర్తయ్యాక కచ్చితంగా గుజరాత్ 250 పరుగుల మైల్ స్టోన్‌ దాటేస్తుందని అందరూ భావించారు. 


వాళ్లిద్దర్నీ తప్ప.. 


చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే రెండు వికెట్లు తీయగా.. ఆ తరువాత శార్దూల్ తక్కువ (6.2) ఎకానమీతో  కొంత మెరుగ్గా బౌలింగ్ చేశాడు.  మిగతా వాళ్లందర్నీ గుజరాత్ ఓపెనర్లు చితక్కొట్టారు. 


సచిన్  రికార్డు బద్దలు.. 


మ్యాచ్‌లో సాయి సుదర్శన్ మరో రికార్డు నెలకొల్పాడు.  తన 25వ ఐపీఎల్ గేమ్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన సాయి సుదర్శన్.. ఈ ఫీట్ సాధించిన ఫాస్టెస్ట్ ఇండియన్‌గా రికార్డు సృష్టించాడు. సచిన్, రుతురాజ్ గైక్వాడ్‌లు వెయ్యి పరుగులు 31 మ్యాచుల్లో సాధించారు.