IPL 2025 CSK Out Of Play Offs With 7th Loss: ఐదుసార్లు చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లోనూ తడబాటు చూపిస్తోంది. 2023లో చివరిసారిగా చాంపియన్ గా నిలిచిన ఈ జట్టు.. గతేడాది ఐదో స్థానంలో నిలిచి, త్రుటిలో ప్లే ఆఫ్ చాన్స్ పోగొట్టుకుంది. గతేడాది జరిగిన మెగావేలంలో కొత్త జోష్ తో కనిపించిన సీఎస్కే.. ఆ జోరును టోర్నీలో చూపించడంలో విఫలమైంది. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్ లు ఆడి, కేవలం రెండింటిలోనే గెలిచింది. ఏడు మ్యాచ్ ల్లో ఓడిపోయి, ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. అద్బుతం జరిగితేనే చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశముంది. ఇక వేలంలో సరైన ఆటగాళ్లను తీసుకోకపోవడంతోనే సీఎస్కే ఓటమిపాలైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా వ్యాఖ్యానించాడు. టోర్నీ ఆరంభంలో సరైన ఆటగాళ్లను పిక్ చేయక పోవడంతోనే ఓటములు ఎదురయ్యాయని వాపోయాడు.
కొత్త ఆటగాళ్లు సూపర్ ఫ్లాప్..
ఈ సీజన్ లో దేశవాళీ సినియర్ ప్లేయర్లయిన రాహుల్ త్రిపాఠి, దీపక్ హూడా, విజయ్ శంకర్ లను తీసుకుంది. అలాగే రవిచంద్రన్ అశ్విన్ కూడా పునరాగమనం చేశాడు. వీరంతా సత్తా చాటడంలో విఫలమయ్యారు. ఏ ఒక్కరూ తమ దైన శైలిలో మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. వరుస ఓటములు ఎదురైనా కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడం కూడా ప్రభావం చూపించింది. అంతా అయిపోయాక, షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రివిస్ లాంటి ఆటగాళ్లను చాన్స్ లివ్వడం, వాళ్లు నిరూపించుకోవడం అంతా చూశారు. సరైన గేమ్ ప్లానింగ్ లేకపోవడంతోనే సీఎస్కే ఓటమి పాలైంది.
బద్దలైన చేపాక్ కోట..
సొంతగడ్డపై అత్యంత బలమైన జట్లలో సీఎస్కే ఒకటి, దశాబ్ధానికిపైగా కొన్ని జట్లు అక్కడ విజయం సాదించలేక పోయాయి. అయితే ఈ సీజన్ లో మాత్రం ఈ రికార్డుకు చెల్లు చీటీ పడింది. 17 ఏళ్ల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, 12 ఏళ్ల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ చేపాక్ లో తొలి విజయం సాదించి, చెన్నై కోటను బద్దలు కొట్టాయి. ఇక ఈ సీజన్ లో గాయాలతో సతమతమవడం కూడా జట్టును దెబ్బ తీసింది. గాయంతో రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరమవ్వడం, మోకాలి గాయంతోనే తాజా కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడటం, విదేశీ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, డేవన్ కాన్వే, శామ్ కరన్ విఫలం కావడం దెబ్బ తీసింది. ఇక ఇప్పటికే ఏడు మ్యాచ్ లు ఓడిన చెన్నై, మిగతా 5 మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే, ఏదైనా చిన్న అవకాశం ఉండొచ్చు. అయితే దానికి చాలా సమీకరణాలు కలిసి రావాలి. ఏదేమైనా అసలు తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించుకుని, తర్వాత ఏడాది బలంగా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.