Katrina Kaif New Brand Ambassidor For CSK : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL 2024)లో మినీ వేలం ప్రక్రియ ముగిసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐపీఎల్‌ క్రికెట్‌(Cricket) సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మార్చి 23 నుంచి మే 29 వరకు ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 10 జట్టు 74 మ్యాచ్ లు ఆడనున్నాయి. ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఇటీవలే పూర్తికాగా.. అందుబాటులో ఉన్న ప్లేయర్లు ప్రాంచైజీల పర్యవేక్షలో ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు.


ఇక 2023 ఐపీఎల్ టోర్నీని చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టు గెలుచుకుంది. ఇప్పటికే అయిదుసార్లు కప్పును గెలుచుకున్న చెన్నై మరోసారి కప్పును ఒడిసిపట్టాలని పట్టుదలగా ఉంది. చెన్నై సారధి ఎం.ఎస్. ధోనీ( MS Dhoni) మరోసారి జట్టును విజేతగా నిలపాలని పట్టుదలతో ఉన్నాడు. ఈసారి ఐపీఎల్‌లో మరోసారి తనసత్తాను చూపేందుకు తలైవా సిద్ధమవుతున్నాడు.  ఈ మ‌ధ్యే యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌కు చెందిన‌ ఎతిహ‌ద్ ఎయిర్‌వేస్ (Etihad Airways) కంపెనీకి స్పాన్స‌ర్‌షిప్ హ‌క్కులు క‌ట్టబెట్టిన సీఎస్కే.. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్‌(Katrina Kaif)ను ఎంపిక చేసింది. అయితే.. ఈ విష‌యాన్ని చెన్నై మేనేజ్‌మెంట్ అధికారింగా వెల్ల‌డించ‌లేదు. సీఎస్కే కొత్త స్పాన్స‌ర్ ఎతిహ‌ద్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్న‌ క‌త్రినా.. ధోనీ సేన‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. ఈసారి చెన్నై డిఫెండింగ్ చాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగ‌నుంది. నిరుడు అహ్మ‌దాబాద్‌లో జ‌రిగిన ఫైన‌ల్లో ధోనీ సేన గుజ‌రాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.


కొత్త లోగో బ్యాట్‌తో ధోనీ 
తాజాగా ధోనీ కొత్త లోగో ఉన్న బ్యాట్‌తో ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. బాల్యమిత్రుడికి సాయం చేయాల‌నే ఉద్దేశంతో ధోనీ తన ఫ్రెండ్‌ షాప్ పేరుతో ఉన్న‌ స్టిక్కర్ అతికించిన బ్యాటుతో మ‌హీ ప్రాక్టీస్ చేశాడు. ధోనీ చిన్నప్పటి స్నేహితుడికి ‘ప్రైమ్ స్పోర్ట్స్' అనే క్రీడా పరికరాల దుకాణం ఉంది. ఇందులో క్రికెట్ కిట్తో పాటు జెర్సీలు, ఇత‌ర ఆట సామ‌గ్రి ల‌భిస్తాయి. దాంతో, త‌న మిత్రుడి దుకాణానికి మ‌రింత పాపులారిటీ తేవ‌డం కోసం ధోనీ.. ప్రైమ్ స్పోర్ట్స్ స్టిక్కర్ ఉన్న బ్యాటుతో ప్రాక్టీస్ చేశాడు. ఇంకేముంది.. క్షణాల్లో ఆ ఫొటోలు, వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారాయి. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీ.. త‌న కెరీర్‌లో చాలా కంపెనీల లోగో ఉన్న బ్యాట్‌లు ఉప‌యోగించాడు.  అత‌డు స్నేహితుల దుకాణం పేరున్న బ్యాటుతో క‌నిపించ‌డం మాత్రం ఇదే తొలిసారి. 


కొద్ది రోజుల క్రితం టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్‌ ధోని(MS Dhoni)... జార్ఖండ్‌(Jarkhand) రాంచీ(Ranchi)లోని పవిత్ర దేవరీ ఆలయాన్ని( Dewri Temple) సందర్శించాడు. అభిమానుల మధ్య క్యూ లైన్‌లో నిల్చొని అమ్మవారిని దర్శించుకున్నాడు. దేవరీ ఆలయంలోని దుర్గాదేవికి మహీ ప్రత్యేక పూజలు చేయగా అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. దేవరీ ఆలయంలో ధోనీ ప్రత్యేక పూజలు చేయడం ఇదే తొలిసారి కాదు. కీలక టోర్నీలు, ముఖ్యమైన పనులు చేపట్టే ముందు మహీ ఈ ఆలయాన్ని సందర్శించి దుర్గాదేవి దర్శనం చేసుకుంటాడు. భారత జట్టులోకి ఎంపికైనప్పటి నుంచి ధోనీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రపంచకప్ టోర్నీలు, ఐపీఎల్‌కు ముందు ఈ ఆలయాన్ని సందర్శించి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాడు.