Pant confident of playing IPL 2024: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌( Rishabh Pant) అభిమానులకు గుడ్‌న్యూస్‌. పంత్‌ ఈ ఐపీఎల్‌లో ఆడడం ఖాయమని ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌( Ricky Ponting) స్పష్టం చేశాడు. రికీ పాంటింగ్‌ ప్రకటనతో ఢిల్లీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.  రిషబ్‌ పంత్‌ ఐపీఎల్‌ పూర్తిగా ఆడనున్నాడని... అయితే బ్యాటర్‌గానా.. వికెట్‌కీపర్‌ బాధ్యతలు కూడా చేపడతాడా అన్నది ఇంకా తెలియదని పాంటింగ్‌ చెప్పాడు. పంత్‌ పూర్తి ఐపీఎల్‌ ఆడటంపై విశ్వాసంగా ఉన్నాడని.. అతడి బాధ్యతలపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పాంటింగ్‌ తెలిపాడు. పంత్‌ ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రాక్టీస్‌ ఆరంభించాడు. ఐపీఎల్‌ ఆరంభానికి ఇంకా ఆరు వారాలు మాత్రమే సమయం ఉందని.. పంత్‌ వికెట్‌కీపింగ్‌ చేస్తాడా అన్నది చెప్పలేమని పాంటింగ్‌ స్పష్టం చేశాడు.  ఈ ఐపీఎల్‌లో అతడిని బ్యాటర్‌గానైతే చూడొచ్చని కూడా చెప్పాడు. అన్ని మ్యాచ్‌ల్లో ఆడించడంపైనా నిర్ణయం తీసుకోలేదని.... లీగ్‌ దశలో 14లో 10 మ్యాచ్‌ల్లో ఆడినా తమకు బోనసే అని ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ తెలిపాడు. పంత్‌ను అడిగితే మాత్రం ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌ల్లో ఆడతాను.. బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌ కూడా చేస్తానంటాడని పాంటింగ్‌ తెలిపాడు. 


ఆ ప్రమాదంతో....
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(Rishabh Pant) డిసెంబర్‌లో రూర్కీ వెళ్తుండగా కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఏడాది క్రితం డిసెంబర్‌ 30న పంత్‌కు యాక్సిడెంట్‌ అయింది. ఇప్పటికీ ఈ ప్రమాదం జరిగి ఏడాది గడిచిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో అతని కాలులోని లిగమెంట్‌ చిరిగిపోయింది. దీంతో పాటు చేయి, కాలు, వీపుకు కూడా గాయాలయ్యాయి. అతని ప్రాథమిక చికిత్స మొదట డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో జరిగింది. కొత్త ఏడాది రోజున ఇంట్లో వారికి సర్‌ప్రైజ్‌ ఇద్దామని ఢిల్లీ నుంచి ఒంటరిగా పంత్‌ బయల్దేరగా.. ఢిల్లీ-రూర్కీ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గత ఏడాదిగా క్రికెట్‌కు దూరమైన పంత్‌ మళ్లీ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఆడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆనాడు జరిగిన ప్రమాదాన్ని తలుచుకుని రిషబ్‌ పంత్‌ మరోసారి వణికిపోయాడు. కాలు తీసేస్తారమో అనుకుని భయపడి పోయానని పంత్‌ అన్నాడు.


కాలు తొలగిస్తే...
గత ఏడాది తన కారు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరిన తర్వాత నరాలు దెబ్బ తిన్నాయేమో అనుకుని భయపడిపోయానని పంత్‌ అన్నాడు. అదే జరిగితే కాలు తొలగించే అవకాశం ఉంటుందని... ఈ విషయం తలుచుకుంటే భయం వేసిందని నాటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్రమాదం తర్వాత కొందరు వచ్చి సాయం చేశారని.... తన కాలు సరి చేయమని అక్కడ ఉన్న ఒకతన్ని అడిగానని... తనను వేరే కారుకు మార్చినట్టు మాత్రమే జ్ఞాపకముందని... తర్వాత ఏదీ గుర్తులేదని పంత్‌ తెలిపాడు. కారు ప్రమాదంలో గాయపడ్డ పంత్ గత ఐపీఎల్(IPL) టోర్నీకి దూరమయ్యాడు. ఈసారి ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో పునరాగమనం కోసం తీవ్రకసరత్తు చేస్తున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ ల ప్రారంభం నాటికి పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో ఉండేందుకు శ్రమిస్తున్నాడు.