Patna News: దేశవాళీ అత్యున్నత క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ ( Ranji Trophy 2023-24 )లో బీహార్(Bihar) యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) చరిత్ర సృష్టించాడు. కేవలం 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులో రంజీ ట్రోఫీ‌లోకి బీహార్‌కు చెందిన వైభవ్‌ సూర్యవంశీ రంజీల్లోకి అరంగేట్రం చేశాడు. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో భాగంగా ముంబైతో మొదలైన మ్యాచ్‌లో బీహార్‌ తరఫున వైభవ్‌ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో బ‌రిలోకి దిగిన వైభ‌వ్.. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నాలుగో అతి పిన్నవయస్కుడైన భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.

 

ఫస్ట్‌ క్లాస్‌లోకి అరంగేట్రం చేసిన అతి పిన్నవయస్కుడైన భారతీయుడి రికార్డు అలీముద్దీన్‌ పేరిట ఉంది. అలీముద్దీన్‌ 1942-43 రంజీ సీజన్‌లో రాజ్‌పుటానా తరఫున 12 ఏళ్ల 73 రోజుల వయసులో తొలిసారి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడాడు. అలీముద్దీన్‌ తర్వాత అత్యంత పిన్న వయస్కుడైన భారతీయుడిగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడిన రికార్డు ఎస్‌కే బోస్‌, మొహమ్మద్‌ రంజాన్‌ పేరిట ఉంది. బోస్‌.. 1959-60 రంజీ సీజన్‌లో 12 ఏళ్ల 76 రోజుల వయసులో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. రంజాన్‌.. 1937 సీజన్‌లో 12 ఏళ్ల 247 రోజుల వయసులో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

 

వైభ‌వ్ కూచ్ బెహ‌ర్ ట్రోఫీలో బిహార్ త‌ర‌ఫున స‌త్తా చాటాడు. జార్ఖండ్‌పై ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌తో సెంచరీ చేశాడు. 128 బంతుల్లోనే 22 ఫోర్లు, 3 సిక్సర్లతో 151 ప‌రుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 78 పరుగులు చేశాడు. భార‌త‌ అండ‌ర్ 19 ఏ జ‌ట్టు, భార‌త అండ‌ర్ 19 బి జ‌ట్టు, ఇంగ్లండ్ అండ‌ర్ 19, బంగ్లాదేశ్ అండ‌ర్ 19 జ‌ట్లు పాల్గొన్న సిరీస్‌లో వైభవ్‌ రెండు హాఫ్ సెంచ‌రీలతో ఔరా అనిపించాడు. వైభవ్‌.. రంజీ అరంగేట్రానికి ముందు 2023 ఎడిషన్‌ కూచ్‌ బెహార్‌ ట్రోఫీలో బీహార్‌ తరఫున ఓ మ్యాచ్‌ ఆడాడు. జార్ఖండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో వైభవ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో 151, 76 పరుగులు చేశాడు. వైభవ్‌కు లోకల్‌ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్‌గా పేరుంది. 

 

రంజీ ట్రోఫీ ప్రారంభం

దేశవాళీ అత్యున్నత క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ 2024 సీజన్‌ ప్రారంభమైంది. కెరీర్‌‌‌‌ చివరి దశలో ఉన్న అజింక్యా రహానె, చతేశ్వర్‌‌‌‌ పుజారా, మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, జైదేవ్‌‌‌‌ ఉనాద్కట్‌‌‌‌లాంటి ప్లేయర్లు మరోసారి టీమిండియాలో చోటు సంపాదించాలని భావిస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్‌‌‌‌, అభిమన్యు ఈశ్వరన్‌‌‌‌, సర్ఫరాజ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, విద్వత్‌‌‌‌ కావేరప్ప, ఇషాన్‌‌‌‌ పోరెల్‌‌‌‌ ఫ్యూచర్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని రంజీల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. రంజీ ట్రోఫీ 2024 కోసం బెంగాల్ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యుల జట్టుకు పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ నాయకత్వం వహించనున్నారు. తివారీకి ఇదే చివరి టోర్నీ కావడం గమనార్హం. ఈ రంజీ ట్రోఫీతో క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని మనోజ్ తివారీ నిర్ణయించుకున్నాడు. ఈ పద్దెనిమిది మంది సభ్యుల జట్టులో మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ చోటు దక్కించుకున్నాడు. 2021లో ముస్తాక్ అలీ టోర్నీ ద్వారా దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కైఫ్.. తొలిసారి రంజీ జట్టుకు ఎంపిక అయ్యాడు. మహ్మద్ షమీలాగే మహ్మద్ కైఫ్ కూడా ఫాస్ట్ బౌలర్. లీస్ట్ ఏ క్రికెట్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన అతను ఇప్పటికే 12 వికెట్లు తీశాడు.