స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ అలా ముగిసిందో లేదో దేశంలో ఐపీఎల్‌ సందడి మొదలైంది. ఇప్పటికే మినీ వేలం ముగిసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడింగ్‌ జరిగి హార్దిక్‌ పాండ్యా మళ్లీ ముంబై గూటికి చేరాడు. ఐపీఎల్‌ ఎంతోమంది ఆటగాళ్ల జీవితాలను మలుపుతిప్పింది. ఈ లీగ్‌లో ఆడితే డబ్బుకు డబ్బు, మంచి క్రేజ్‌ కూడా సంపాదించుకుకోవచ్చని ఆటగాళ్లు భావిస్తుంటారు. ప్రపంచంలోనే ధనిక లీగ్‌లో ఆడాలని ఆటగాళ్లు కలలు కంటుంటారు. తనకు ప్రపంచ అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాలని ఉందని పాక్‌ పేసర్‌ హసన్ అలీ అన్నాడంటే ఈ లీగ్‌ ప్రాముఖ్యత తెలుసుకోవచ్చు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన లీగ్‌లో ఆడాలని భావిస్తున్న అఫ్గానిస్థాన్‌ క్రికెటర్లకు షాక్‌ తగిలింది. 

 

నిరభ్యంతర పత్రం ఇవ్వని ఏసీబీ...

ఆఫ్గాన్‌ క్రికెటర్లు ముజీబుర్‌ రెహ్మాన్‌, నవీనుల్‌ హక్‌, ఫజల్‌ హక్‌ ఫరూఖీలకు అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. వచ్చే రెండేళ్ల పాటు లీగుల్లో ఆడడం కోసం ఈ ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రాలు ఇవ్వకూడదని అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. దీంతో ఈ ముగ్గురు ఆటగాళ్లు  ఐపీఎల్‌లో ఆడడం సందిగ్ధంలో పడింది. అఫ్గాన్‌ జట్టు ప్రయోజనాల కంటే కూడా సొంత ప్రయోజనాలకే వీరు ప్రాధాన్యం ఇస్తున్నారని అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 1 నుంచి మొదలయ్యే వార్షిక సెంట్రల్‌ కాంట్రాక్టు నుంచి తమను తప్పించాలని ఈ ముగ్గురు ఆటగాళ్లు ఏసీబీని కోరడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ముగ్గురి కాంట్రాక్టులపై నిర్ణయాన్ని వాయిదా వేసిన ఏసీబీ.. వీళ్లపై విచారణకు ఓ కమిటీని కూడా నియమించింది. ఈ నెలలో జరిగిన ఐపీఎల్‌ వేలంలో ముజీబ్‌ను రూ.2 కోట్లకు కోల్‌కతా తీసుకుంది. నవీనుల్‌ను లఖ్‌నవూ, ఫరూఖీని సన్‌రైజర్స్‌ అట్టిపెట్టుకున్నాయి. ఇప్పుడు వీరికి ఎన్‌ఓసీ వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 

 

దుబాయ్‌ వేదికగా జరిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మినీ వేలంలో 72 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా(Australia) ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) అత్యంత ఖరీదైనదిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్ (Pat Cummins) రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. రూ. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) కొనుగోలు చేసింది. అయితే ఈ వేలం మాత్రం ఎంతో మంది భారత ఫ్యాన్స్‌ను నిరాశపర్చింది. ఇతర దేశాల ఆటగాళ్లకు ఈ స్థాయిలో ధర పలకడం పట్ల టీమిండియా ఫ్యాన్స్, టీమిండియా మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఒక్కో ఫ్రాంఛైజీ(Franchise) ఆటగాళ్ల కోసం రూ.100 కోట్ల పర్సు ఉంటుంది. అందులో దాదాపు 25 శాతం ఒక్క ప్లేయర్ కోసమే వెచ్చించడం ఎంత వరకు కరెక్టని కామెంట్లు చేస్తున్నారు. ఆసీస్ స్టార్లు మిచెల్ స్టార్క్‌, ప్యాట్ కమిన్స్‌ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా నిలిచారు. దీనిపై రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాజీ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్‌ స్పందించాడు. మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌కు అంత భారీ ధర పలకడానికి గల కారణాలేంటో అర్థం కావడం లేదంటూ ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. వారిద్దరూ మంచి ఆటగాళ్లే కానీ వారిపై ఇంత భారీ ధర వెచ్చించడం మాత్రం షాకింగ్‌గా అనిపిస్తోందని అన్నాడు.