IPL 2025 CSK VS MI Updates: ఐపీఎల్ ఎప్పుడు జరిగినా, టైటిల్ ఫేవ‌రేట్ల‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఉంటుంది. మెగాటోర్నీలో ఆ జ‌ట్టు రికార్డు అనిత‌ర సాధ్యం.. ఏకంగా 12 సార్లు ప్లే ఆఫ్స్ కు అర్హ‌త సాధించిన చెన్నై.. ప‌ది సార్లు ఫైన‌ల్స్ కి చేరుకుంది. అందులో ఐదుసార్లు విజేత‌గా నిలిచింది. ఇంత క‌న్సిస్టెంట్ ప్ర‌ద‌ర్శ‌న మ‌రే జ‌ట్టు త‌ర‌పున చూడ‌లేము. ముంబై ఇండియ‌న్స్ త‌ర్వాత ఐదు టైటిళ్ల‌తో టోర్నీలో అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్ల‌లో ఒక‌టిగా నిలిచింది. ఆరోసారి టైటిల్ కొట్టాల‌ని భావిస్తున్న చెన్నై.. ఈసారి మెగావేలంలో జ‌ట్టును ఆల్ రౌండ‌ర్ల‌లో నింపింది. ఇక జ‌ట్టు బ్యాటింగ్ విష‌యానికొస్తే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డేవ‌న్ కాన్వే, ర‌చిన్ ర‌వీంద్ర‌, రాహుల్ త్రిపాఠిల‌తో టాపార్డ‌ర్ ప‌టిష్టంగా ఉంది. మిడిలార్డ‌ర్లో ఎంఎస్ ధోనీ, ర‌వీంద్ర జ‌డేజా, శివ‌మ్ దూబే, శామ్ క‌ర‌న్ ర‌విచంద్ర‌న్ అశ్విన్, విజ‌య్ శంక‌ర్ లాంటి ప్లేయ‌ర్ల‌తో ప‌టిష్టంగా ఉంది. ఇక స్పిన్న‌ర్లుగా అశ్విన్, జ‌డేజా ద్వ‌యంతోపాటు నూర్ అహ్మ‌ద్, శ్రేయ‌స్ గోపాల్ త‌దిత‌రులు ఉన్నారు. 


కాస్త బ‌ల‌హీనంగా పేస్ బౌలింగ్..
జ‌ట్టులో అనుభ‌వం ఉన్న పేస‌ర్లు లేక‌పోవ‌డం చెన్నై బ‌ల‌హీన‌త‌గా చెప్పుకొవ‌చ్చు. అటు ఇంట‌ర్నేష‌న‌ల్, ఇటు నేష‌న‌ల్ లెవ‌ల్లో పేరుగాంచిన పేస‌ర్లు ఎవ‌రూ లేరు. నాథ‌న్ ఎల్లిస్, మ‌తీషా ప‌త్తిరాణ‌, ఖ‌లీల్ అహ్మ‌ద్, ముఖేశ్ చౌధ‌రీ,  క‌మ‌లేశ్ నాగ‌ర్ కోటీల‌తో సాధార‌ణంగా ఉంది. ఇందులో ప‌త్తిరాణ‌కు మాత్ర‌మే మంచి గుర్తింపు ఉంది. అయితే పేస్ బౌలింగ్ ఆల్ రౌండ‌ర్లు క‌ర‌న్, దూబే, శంక‌ర్ త‌దిత‌రులు ఉండ‌టం సానుకూలాంశం. ఇక ముందే చెప్పుకున్న‌ట్లుగా టోర్నీలో చెన్నైకి బ‌ల‌మైన చ‌రిత్ర ఉంది.


ఐదుసార్లు చాంపియ‌న్..
2008లో ఐపీఎల్ ప్రస్థానం ప్రారంభించిన చెన్నై.. ఆ ఏడాదే ర‌న్న‌ర‌ప్ గా నిలిచి స‌త్తా చాటింది. ఆ త‌ర్వాత 2010, 11, 2018, 2021, 2023ల‌లో విజేత‌గా నిలిచి, అత్య‌ధిక టైటిళ్ల‌తో ముంబై స‌ర‌స‌న నిలిచింది. దీంతోపాటు 2008, 2012, 2013, 2015, 2019ల‌లో ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది. టోర్నీలో 2020లో తొలిసారిగా ప్లే ఆఫ్స్ కు చేర‌లేదు. అలాగే గ‌త సంవ‌త్స‌రం మాత్ర‌మే ఐదో స్థానంలో నిలిచి నాకౌట్ కు అర్హత సాధించ‌లేక‌పోయింది. ఇంత ఘ‌న చ‌రిత్ర ఉన్న చెన్నైకి కెప్టెన్సీ విష‌యంల స‌మ‌స్య ఉంది. దిగ్గ‌జ కెప్టెన్ ధోనీ.. సార‌థ్య బాధ్య‌తల‌ను రుతురాజ్ కు అప్ప‌గించ‌డం బెడిసి కొట్టింది. గ‌తేడాది త్రుటిలో ప్లే ఆఫ్స్ స్థానం కోల్పోయిన చెన్నై, ఈసారి మాత్రం టైటిల్ సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. అలాగే ఈ సారి క‌నుక తేడా వ‌స్తే రుతురాజ్ పై వేటు త‌ప్ప‌దు. ఈక్ర‌మంలో జ‌ట్టు ఈ సారి కాస్త ఒత్త‌డిలో ఉంది. అయిత మేటీ ఫినిష‌ర్ ధోనీ మంచి ట‌చ్ లో ఉండ‌టం ప్ల‌స్ పాయింట్. స‌రైన కూర్పుతో ముందుకెళితే ఫైన‌ల్ కు చేరుకోవ‌డం ముంబైకి పెద్ద విష‌యం కాదు. ఇక 2016, 2017ల‌లో స్పాటి ఫిక్సింగ్, బెట్టింగ్ త‌దిత‌ర కార‌ణాల‌తో చెన్నై జ‌ట్టును ఐపీఎల్ యాజ‌మాన్యం రెండేళ్ల పాటు నిషేధించింది. 


చెన్నై జ‌ట్టు స్క్వాడ్:  డెవన్ కన్వే, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సామ్ కరన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎలిస్, మాథీషా పతిరాణ, ఖలీల్ అహ్మద్, ఆండ్రే సిద్దార్థ్, వంశ్ బెడీ, షేక్ రశీద్, రామకృష్ణ ఘోష్, శ్రేయాస్ గోపాల్, అన్షుల్ కంబోజ్, గుర్జపనీత్ సింగ్, ముకేశ్ చౌదరి, కమలేశ్ నాగార్కోటీ.