IPL 2025 Big Shock To RR: ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే మాజీ చాంపియ‌న్స్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌లింది. టోర్నీలోని తొలి మూడు మ్యాచ్ ల‌కు కెప్టెన్సీ నుంచి సంజూ శాంస‌న్ దూర‌మ‌య్యాడు. త‌ను ఈ మూడు మ్యాచ్ ల‌లో కేవ‌లం స్పెష‌లిస్టు బ్యాట‌ర్ గానే బ‌రిలోకి దిగుతాడ‌ని ఫ్రాంచైజీ యాజ‌మాన్యం తెలిపింది. చేతివేలి గాయంతో బాధ‌ప‌డుతున్న సంజూ.. కోలుకుంటున్నాడు. బీసీసీఐ మెడిక‌ల్ టీమ్ నుంచి త‌న‌కు క్లియ‌రెన్స్ రాలేదు. కేవ‌లం బ్యాట‌ర్ గా ఆడేందుకు మాత్ర‌మే అనుమ‌తి రావ‌డంతో తొలి మూడు మ్యాచ్ ల వ‌ర‌కు త‌ను కేవ‌లం బ్యాట‌ర్ గా మాత్ర‌మే ఆడ‌తాడు. దీంతో త‌న కెప్టెన్సీని తాత్కాలికంగా సీనియ‌ర్ ప్లేయ‌ర్ రియాన్ ప‌రాగ్ కు అప్ప‌గించాడు. అసోంకు చెందిన ప‌రాగ్.. డొమెస్టిక్ లెవ‌ల్లో ఆ జ‌ట్టు ను న‌డిపించిన అనుభ‌వం ఉంది. అలాగే జ‌ట్టు కోర్ స‌భ్యుల్లో ప‌రాగ్ ఒక‌డు. తొలి మూడు మ్యాచ్ ల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రాగ్ కెప్టెన్సీ వ‌హిస్తాడ‌ని ఫ్రాంచైజీ తెలిపింది. ఈనెల 22న ఐపీఎల్ ప్రారంభం అవుతుండ‌గా, రాజస్థాన్ త‌మ తొలి మ్యాచ్ ను స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో ఈనెల 23న హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా ఆడుతుంది. 






నో క్లియ‌రెన్స్..
ఇంగ్లాండ్ టీ20 సిరీస్ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి నెల‌లో చేతివేలి గాయానికి గురైన సంజూకి ఆ త‌ర్వాత స‌ర్జీరీ జ‌రిగింది. అప్ప‌టి నుంచి బీసీసీఐ మెడిక‌ల్ టీమ్ ఆధ్వ‌ర్యంలో అత‌నికి చికిత్స జ‌ర‌గుతోంది. అయితే ఐపీఎల్ స‌మీపించిన వేళ‌, ఇప్ప‌టికే జ‌ట్టుతో చేరిన సంజూకు బోర్డు నుంచి కీల‌క ఆదేశాలు అందాయి. తొలి మూడు మ్యాచ్ ల్లో అటు వికెట్ కీపింగ్ తోపాటు, ఇటు ఫీల్డింగ్ చేయ‌డానికి వీలు లేద‌ని పేర్కొంది. దీంతో త‌ను కేవ‌లం స్పెష‌లిస్టు బ్యాట‌ర్ గానే బ‌రిలోకి దిగుతాడు. సంజూ త‌మ కోర్ ప్లేయ‌రని, తొలి మూడు మ్యాచ్ ల‌కు త‌ను దూర‌మైనా, తిరిగి ఆ త‌ర్వాత మ్యాచ్ ల‌కు సార‌థ్యం వ‌హిస్తాడ‌ని పేర్కొంది. 


అసోంలో మ్యాచ్ లు..
హైద‌రాబాత్ తో మ్యాచ్ అనంత‌రం త‌న రెండు హోం మ్యాచ్ ల‌ను అసోంలోని ఏసీఏ స్టేడియంలో రాయ‌ల్స్ ఆడుతుంది. ఈనెల 26న కోల్ కతా నైట్ రైడర్స్ తో, ఈనెల 30న చెన్నై సూప‌ర్ కింగ్స్ తో త‌ల‌ప‌డుతుంది. ఈ మూడు మ్యాచ్ ల‌కు ప‌రాగ్ నాయ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని పేర్కొంది. రాయ‌ల్స్ తో చాలా కాలం ప్ర‌ధాన స‌భ్యుడిగా ఉన్న ప‌రాగ్, టీమ్ డైమెన్స‌న్, ఆట‌గాళ్ల‌పై అవ‌గాహ‌న ఉంది. దీంతో త‌న‌కిచ్చిన కెప్టెన్సీ టాస్కుని ప్ర‌భావ‌వంతంగా నెర‌వేర్చ‌గ‌ల‌డ‌ని ఫ్రాంచైజీ ఆశాభావం వ్య‌క్తం చేసింది. ఇక 2008లో తొలిసారి టైటిల్ సాధించిన రాయ‌ల్స్, ఆ త‌ర్వాత ఆ స్థాయి ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. గ‌తేడాది ప్లే ఆఫ్స్ కు చేరినా, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ చేతిలో ఓడిపోయింది.