Rs. 90 Lakhs Scam In HCA:  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)లో భారీ అవినీతి జ‌రిగింది. ఉప్ప‌ల్ రాజీవ్ గాంధీ స్టేడియానికి సంబంధించి కొనుగోళ్ల‌లో క్విడ్ ప్రోకో జ‌రిగింద‌ని తాజాగా ఈడీ జ‌రిపిన విచార‌ణ‌లో తేలింది.  రూ.90ల‌క్ష‌ల‌కుపైగా నిధుల దుర్వినియోగం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టి హెచ్ సీఏ వైస్ ప్రెసిడెంట్, ట్రెజ‌ర‌ర్ సురేంద‌ర్ అగ‌ర్వాల్ కుటుంబంతో ఈ కుంభ‌కోణానికి సంబంధాలు ఉన్న‌ట్లు తేలింది.   క్రికెట్‌‌ బాల్స్‌‌, జిమ్ పరికరాలు, బకెట్ కుర్చీల కొనుగోళ్లలో క్విడ్ ప్రొకో జరిగినట్టు గుర్తించింది. కాంట్రాక్ట్‌‌ కంపెనీల నుంచి సురేందర్ అగర్వాల్ కుటుంబ సభ్యుల అకౌంట్లకు మనీలాండరింగ్ జరిగినట్టు ఆధారాలు గుర్తించింది. దీంతో సురేందర్‌‌‌‌ అగర్వాల్‌‌, ఆయన భార్య, కొడుకు, కోడలికి చెందిన రూ.51.29 లక్షల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ తాజాగా ప్రకటన వెలువ‌రించింది. 


అజారుద్దీన్ హ‌యాంలో.. 


భార‌త మాజీ కెప్టెన్ అజహరుద్దీన్‌‌‌‌ హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌గా ఉన్న సమయంలో వైస్‌‌ ప్రెసిండెంట్‌‌, ట్రెజరర్‌‌‌‌గా సురేందర్ అగర్వాల్ వ్య‌వ‌హ‌రించారు. వీరి హయాంలో 2019–2022 సంవత్సరాలకు గాను బీసీసీఐ నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో ఉప్పల్‌‌ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అవసరమైన క్రికెట్ బాల్స్‌‌, జిమ్ పరికరాలు, బకెట్ కుర్చీలు, అగ్నిమాపక పరికరాలు ప‌ర్చేజ్ చేశారు. అయితే ఈ నిధుల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు అప్పటి ఫోరెన్సిక్‌‌ ఆడిట్‌‌ రిపోర్ట్‌‌లో వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో 2023 అక్టోబర్‌‌‌‌లో హెచ్‌‌సీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉప్పల్‌‌ పోలీసులు నాలుగు ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌లు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఈడీ.. మనీలాండరింగ్‌‌ కోణంలో నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేసి, వివ‌రాలు సేక‌రించింది. 


 కంపెనీల నుంచి వ‌సూలు..


ఉప్పల్‌‌ స్టేడియానికి ప‌ర‌క‌రాల‌ సప్లయ్‌‌ చేసేందుకు సారా స్పోర్ట్స్, ఎక్సలెంట్ ఎంటర్‌‌‌‌ప్రైజెస్, బాడీ డ్రెంచ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌‌ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారు. సాధార‌ణం కంటే కుట్ర‌పూరితంగా  అధిక ధరలతో లావాదేవీలు నిర్వ‌హించ‌డంతో, ఇలా అక్రమంగా వచ్చిన లాభాలు ఆయా కంపెనీల నుంచి సురేందర్ కుటుంబ సభ్యులకు బదిలీ అయ్యాయి. సురేందర్  భార్య పేరుతో ఉన్న కేబీ జ్యువెలర్స్‌‌కు, ఆయన కొడుకు అక్షిత్ అగర్వాల్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లకు సారా స్పోర్ట్స్‌‌ అకౌంట్‌‌ నుంచి రూ.17 లక్షలు జ‌మ అయ్యాయి.  అలాగే మ‌రో సంస్థ‌ ఎక్సలెంట్ ఎంటర్‌‌ప్రైజెస్ ద్వారా అక్షిత్ అకౌంట్‌‌కు రూ. 21.86 లక్షలు డిపాజిట్ అయ్యాయి. అలాగే బాడీ డ్రెంచ్ ఇండియా అకౌంట్‌‌ నుంచి రూ. 52 లక్షలు బదిలీ అయ్యాయని ద‌ర్యాప్తులో తేలింది. ఇలా క్విడ్ ప్రో కో విధానంలో  సురేందర్ కుటుంబ సభ్యులకు మొత్తం రూ. 90.86 లక్షలు చేరినట్టు ఆధారాలు సేకరించింది. దీని అధారంగా కేసు న‌మోదు చేసిన ఈడీ, ద‌ర్యాప్తు చేస్తోంది. అయితే తాజాగా ఈ కుంభ‌కోణంపై క్రికెట్ ప్రేమికులు  అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే దేశ‌వాళీలో హైద‌ర‌బాద్ జ‌ట్టు ఆట‌తీరు అంతంత‌మాత్ర‌మేన‌ని, ఇక ఇలాంటి కుంభ‌కోణాల‌తో అటు హైద‌రాబాద్, ఇటు తెలంగాణ ప‌రువు మంట క‌లిసింద‌ని వాపోతున్న‌రు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.