మోకాలి గాయంతో బాధపడుతున్న చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చికిత్స తీసుకుంటున్నారు. ముంబైలోని కోకిలాబెన్ హాస్పిట‌ల్‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసింది. ఐపీఎల్‌ 2023 ప్రారంభం నుంచి ధోనీ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. కాలి ఐస్‌ ప్యాక్ వేసుకొని కూడా కొన్ని సార్లు కనిపించాడు. 


చెన్నై జట్టుకు రికార్డు స్థాయి విజయాన్ని అందించిన తర్వాత ఎంఎస్‌ ధోనీ ఆసుపత్రిలో చేరారు. ఎప్పటి నుంచో బాధపెడుతున్న మోకాలి గాయానికి చికిత్స తీసుకుంటున్నారు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటూ చికిత్స తీసుకునే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. 


ఐపీఎల్‌ ప్రారంభం నుంచే మోకాలి గాయం ధోనీని ఇబ్బంది పెడుతోంది. మొదట్లో ధోనీ కదలికలు చాలా ఇబ్బందిగా ఉండేవి. దీనిపై చెన్నై కోచ్‌ ఫ్లెమింగ్‌ ఓ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చారు. ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నాడని ఆయన కదలికల్లో దాన్ని గమనించవచ్చన్నారు. అది ఇబ్బందింగానే ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌కు దూరమయ్యేంత పెద్ద గాయం మాత్రం కాదని చెప్పినప్పటికీ ఫ్యాన్స్‌లో అలజడి రేగింది. 


చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను కోల్ కతా నైట్ రైడర్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయినా చెన్నై ఆటగాళ్లు స్టేడియంలో తిరుగుతూ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ధోనీ మోకాలికి బ్యాండేజ్ కట్టుకుని నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. 


ప్రాక్టీస్ సమయంలో మ్యాచ్‌లు జరుగుతున్న టైంలో ధోని పడే ఇబ్బందిని జట్టు సభ్యులతోపాటు అభిమానులు కూడా గమనించారు. ఆ ఫొటోలు చూసినప్పుడల్లా ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. ధోనీ ఐపీఎల్ చివరి వరకు ఫిట్‌గా ఉంటాడా అనే అనుమానాలు కూడా వచ్చాయి. మొత్తానికి ఫైనల్‌ వరకు రావడమే కాదు. థ్రిల్లింగ్‌ విక్టరీతో మిస్టర్‌ కూల్‌ ఖాతాలో ఐదో ట్రోఫీతోపాటు పలు రికార్డులను కూడా వేసుకున్నాడు. 


ఇప్పుడు మరింత ఫిట్‌గా ఉండేందుకు తన మోకాలికి అయిన గాయాన్ని చికిత్స తీసుకుంటున్నాడు మిస్టర్ కూల్‌ కెప్టెన్.  అయితే ఆయన రిటైర్మెంట్ ప్రకటించేస్తాడా అనే అనుమానం కూడా చాలా మందిలో కలుగుతుంది. గతంలో కూడా రెగ్యులర్‌ క్రికెట్‌కు చాలా సైలెంట్‌గా కూల్‌గా ధోనీ గుడ్‌బై చెప్పేశాడు. ఇప్పుడు అదే చేస్తాడా అనే అనుమానాలు లేకపోలేదు.  


ఐపీఎల్‌ 2023 కప్పు కొట్టిన తర్వాత రిటైర్మెంట్‌పై మాట్లాడుతూ.. అభిమానుల ఆదరణ చూస్తుంటే మరికొన్ని రోజులు ఆడక తప్పదని అన్నారు. అయితే ఈ క్రమంలోనే తన బాడీ సహకరిస్తుందా లేదా అనేది కూడా బేరీజు వేసుకొని మరో ఐపీఎల్‌ సీజన్ నాటికి ఫిట్‌గా ఉండాలి అన్నాడు. 'ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఐపీఎల్ నుంచి రిటైర్ కావడానికి ఇదే సరైన సమయం. కానీ ఈ ఏడాది అభిమానులు చూపిస్తున్న ప్రేమకు వచ్చే ఏడాది కూడా ఆడాలని ఆశిస్తున్నాను. అందరికీ థాంక్స్ చెప్పి వెళ్ళిపోవడం సులభం. కానీ అది మనసుకు కష్టంగా ఉంటుంది. అదే సమయంలో రాబోయే 9 నెలల్లో కష్టపడి అభిమానుల కోసం వచ్చే సీజన్ ఆడేందుకు ప్రయత్నిస్తానని, వారు నాపై చూపే ప్రేమ కోసం నేను ఏం చేస్తానో అదే చేస్తానన్నారు. అది అభిమానులకు నేను ఇచ్చే గిఫ్ట్ అవుతుంది. కానీ అది శరీరానికి అంత సులువు కాదు' అని ధోనీ అన్నాడు.


ఐపీఎల్ 2023 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఐదోసారి ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్‌తో కలిసి అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా ధోనీ సారథ్యంలోని జట్టు నిలిచింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు చెరో 5 ట్రోఫీలు గెలిచాయి.