IPL 2023, Ruturaj Gaikwad:
గతేడాది ఆఖర్లో నిలిచి ఇప్పుడు ట్రోఫీ గెలవడం ఆనందంగా ఉందని చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అంటున్నాడు. ఈ ఐపీఎల్ ట్రోఫీని అంబటి రాయుడుకి అంకితం ఇస్తున్నానని పేర్కొన్నాడు. అతడో అద్భుతమైన క్రికెటర్ అని ప్రశంసించాడు. మిడిలార్డర్లో అజింక్య రహానె, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబె ఆడటం వల్లే సీఎస్కే గెలిచిందని వెల్లడించాడు. తాజాగా అతడు మీడియాతో మాట్లాడాడు.
'ఈ ఐపీఎల్ విజయం వెరీ స్పెషల్! ఎందుకంటే గతేడాది మేమెలా ఆడామో తెలిసిందే. ఈసారి మేం ఘనంగా పునరాగమనం చేశాం. చెన్నైలో గెలిచాం. ప్రత్యర్థి హౌమ్ గ్రౌండ్లలోనూ విజయాలు అందుకున్నాం. ఈ సీజన్ మొత్తం అందరూ రాణించారు. అజింక్య రహానె, డేవాన్ కాన్వే అదరగొట్టారు. అంబటి రాయుడికి ఎక్కువ బంతులు ఆడే అవకాశం రాలేదు. అందుకే ఈ విజయాన్ని అతడికి అంకితం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. చివరి మ్యాచులోనూ మేం మంచి స్టార్ట్ ఇవ్వడం గురించే మాట్లాడుకున్నాం. వికెట్లు చేతిలో ఓవర్ 12-13 పరుగులు చేస్తే గెలవొచ్చని భావించాం' అని గైక్వాడ్ (Ruturaj Gaikwad) అన్నాడు.
ఈ మ్యాచ్ తర్వాత తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించేశాడు. బీసీసీఐ, ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలియజేశాడు. 'ముంబయి, చెన్నై గొప్ప జట్లు. ఐపీఎల్‌లో 204 మ్యాచులు ఆడాను. 14 సీజన్లలో పాల్గొన్నాను. 11 ప్లేఆఫ్‌లు, 8 ఫైనళ్లు, 5 ట్రోఫీలు సొంతం చేసుకున్నాను. ఆరోదీ గెలుస్తాననే అనుకుంటున్నా (ఫైనల్‌కు ముందు ట్వీట్). నేడు జరిగే ఫైనలే ఐపీఎల్లో నా చివరి మ్యాచ్. ఈ టోర్నీని ఆడటం ఎంతో గొప్పగా భావిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. నో యూటర్న్' అని రాయుడు ట్వీట్ చేశాడు.
ఐపీఎల్ సీజన్‌కు అద్భుతమైన ఫినిష్. ‘షాకులు, ట్విస్టులు, ఝలక్కులు, ప్రతీ సీన్ క్లైమ్యాక్స్‌లా ఉంటది...’ ఈ మ్యాచ్‌కు ఇవన్నీ సరిగ్గా సరిపోతాయి. బంతి, బంతికీ మారిన సమీకరణాలు. ఈ ఓవర్‌కు ముందు మ్యాచ్ చెన్నై చేతిలో ఉంటే, తర్వాతి ఓవర్‌కు గుజరాత్ వైపు. చివరి ఐదు ఓవర్లలో అయితే బోలెడన్ని మలుపులు. ఒకానొక దశలో ఐదు బంతుల్లో 28 పరుగులు వచ్చాయి. కానీ వెంటనే రెండు బంతుల్లో రెండు వికెట్లు. ఇంత కంటే డ్రామా ఎక్కడైనా ఉంటుందా? వీటన్నిటినీ దాటి చెన్నై కప్పును కొట్టింది. చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు కావాల్సిన దశలో మొదటి నాలుగు బంతుల్లో మోహిత్ శర్మ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాతి రెండు బంతులను రవీంద్ర జడేజా సిక్సర్, ఫోర్ కొట్టడంతో మ్యాచ్, టైటిల్ రెండూ చెన్నై ఖాతాలో పడ్డాయి. అంత ఒత్తిడిలో కూడా జడేజా అద్బుతమైన ఆటతీరే చెన్నైకి ట్రోఫీని అందించింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా చెన్నై టార్గెట్‌ను 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. చెన్నై చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (96: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వృద్ధిమాన్ సాహా (54: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీ సాధించాడు. చెన్నై బ్యాటర్లలో డెవాన్ కాన్వే (47: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) అత్యధిక పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా (15 నాటౌట్: 6 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఒత్తిడిలో మ్యాచ్‌ను గెలిపించాడు.