Hardik Pandya on MS Dhoni: 


చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ ట్రోఫీ గెలవడం విధి లిఖితమని గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య అన్నాడు. మంచోళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుందని పేర్కొన్నాడు. ఒకవేళ ఓడిపోవాల్సి వస్తే అది ఎంఎస్ ధోనీ (MS Dhoni) చేతుల్లో అయితే తనకు ఆనందంగా ఉంటుందని వెల్లడించాడు. ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో (IPL 2023) గుజరాత్‌ టైటాన్స్‌ ప్రదర్శనను చూస్తే ఆనందంగా ఉందని కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) అంటున్నాడు. 'ఎంఎస్‌ ధోనీని చూస్తే సంతోషంగా అనిపించింది. దీన్ని విధి రాసి పెట్టింది. ఒకవేళ నేను ఓడిపోవాల్సి వస్తే అది ధోనీ చేతుల్లోనైతే మంచిదే. మంచోళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. నాకు తెలిసిన అత్యుత్తమ వ్యక్తుల్లో అతనొకడు. దేవుడు దయామయుడు. దేవుడ నన్ను చాలా కరుణించాడు. కానీ ఈరోజు మహీది' అని హార్దిక్‌ చెప్పాడు.


గుజరాత్‌ టైటాన్స్‌కు (Gujarat Titans) భారీ స్కోర్‌ అందించిన సాయి సుదర్శన్‌ను పాండ్య ప్రశంసించాడు. అత్యంత ఒత్తిడితో కూడిన ఫైనల్లో అతడు 47 బంతుల్లోనే 96 పరుగులు చేయడం అద్భుతమని పొగిడాడు.


'ఒక జట్టుగా మేమెంతో రాణించాం. ప్రాణం పెట్టి ఆడాం. మా పోరాట పటిమను చూసి గర్విస్తున్నాం. మాది ఒకే మంత్రం. కలిసే గెలుస్తాం. కలిసే ఓడిపోతాం. నేనెవరి పైనా నిందలు వేయను. సీఎస్కే మా కన్నా మంచి క్రికెట్‌ ఆడింది. మేం చాలా బాగా బ్యాటింగ్‌ చేశాం. సాయి సుదర్శన్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. ఈ స్థాయిలో అలా ఆడటం సులభం కాదు' అని పాండ్య అన్నాడు.


'మేం కుర్రాళ్లను ఎంతగానో సపోర్ట్‌ చేస్తున్నాం. వారి నుంచి అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏదేమైనా వారి విజయం వారికే సొంతం. మోహిత్‌, రషీద్‌, షమీ సహా అందరూ అద్భుతంగా ఆడారు' అని గుజరాత్‌ కెప్టెన్‌ పేర్కొన్నాడు.




 ఐపీఎల్ సీజన్‌కు అద్భుతమైన ఫినిష్. ‘షాకులు, ట్విస్టులు, ఝలక్కులు, ప్రతీ సీన్ క్లైమ్యాక్స్‌లా ఉంటది...’ ఈ మ్యాచ్‌కు ఇవన్నీ సరిగ్గా సరిపోతాయి. బంతి, బంతికీ మారిన సమీకరణాలు. ఈ ఓవర్‌కు ముందు మ్యాచ్ చెన్నై చేతిలో ఉంటే,  తర్వాతి ఓవర్‌కు గుజరాత్‌ వైపు. చివరి ఐదు ఓవర్లలో అయితే బోలెడన్ని మలుపులు. ఒకానొక దశలో ఐదు బంతుల్లో 28 పరుగులు వచ్చాయి. కానీ వెంటనే రెండు బంతుల్లో రెండు వికెట్లు. ఇంత కంటే డ్రామా ఎక్కడైనా ఉంటుందా? వీటన్నిటినీ దాటి చెన్నై కప్పును కొట్టింది. చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు కావాల్సిన దశలో మొదటి నాలుగు బంతుల్లో మోహిత్ శర్మ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాతి రెండు బంతులను రవీంద్ర జడేజా సిక్సర్, ఫోర్ కొట్టడంతో మ్యాచ్, టైటిల్ రెండూ చెన్నై ఖాతాలో పడ్డాయి. అంత ఒత్తిడిలో కూడా జడేజా అద్బుతమైన ఆటతీరే చెన్నైకి ట్రోఫీని అందించింది.


ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా చెన్నై టార్గెట్‌ను 15 ఓవర్లలో 171 పరుగులకు కుదించారు. చెన్నై చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (96: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వృద్ధిమాన్ సాహా (54: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీ సాధించాడు. చెన్నై బ్యాటర్లలో డెవాన్ కాన్వే (47: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) అత్యధిక పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా (15 నాటౌట్: 6 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఒత్తిడిలో మ్యాచ్‌ను గెలిపించాడు.