IPL 2025 New Rule To Be Implemented in This Season: ఐపీఎల్ అంటేనే డేరింగ్ డెసిష‌న్ల‌కు పెట్టింది పేరు. ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పుల‌ను ప్ర‌వేశ‌పెట్టి, క్రికెట్ గ‌తినే మార్చింది అన‌డంలో సందేహం లేదు. సూప‌ర్ స‌బ్, ఇంపాక్ట్ స‌బ్, స్ట్రాట‌జిక్ టైమౌట్ త‌దిత‌ర నూత‌న ఐడియాల‌ను ఐపీఎల్లో ప్ర‌వేశ పెట్టి, గేమ్ ను లీగ్ మేనేజ్మెంట్ ఎప్ప‌టిక‌ప్పుడు నిత్య నూత‌నంగా కాపాడుతోంది. అయితే తాజాగా ఐపీఎల్ 2025లో కొత్త నిబంధ‌న‌ను పునురుద్ధ‌రించాల‌ని లీగ్ యాజ‌మాన్యం యోచిస్తోంది. నిజానికి ఈ వెసులుబాటు గ‌తంలో ఉన్న‌దే కానీ, కోవిడ్ 19 త‌ర్వాత  ఐసీసీ బ్యాన్ చేయ‌డంతో అప్ప‌టి నుంచి దీన్ని వాడ‌టం లేదు. అది మ‌రేంటో కాదు, స‌లైవా యూజ్ చేయ‌డం.. అంటే బంతికి ఉమ్మి రాసి, దాన్ని షైన్ అయ్యేలా చేయ‌డం ద్వారా రివ‌ర్స్ స్వింగ్ కు ప్ర‌య‌త్నించ‌డం... ఇది గ‌తంలో చాలా ఎఫెక్టివ్ టెక్నిక్ గా ఉండేది. బంతి పాత‌ప‌డ్డాక‌, ఈ ప‌ద్ధ‌తి ద్వారా రివ‌ర్స్ స్వింగ్ ల‌భించేందుకు ఆస్కారం ఉండేది. అయితే కోవిడ్ 19 సంద‌ర్బంగా ఐసీసీ దీనిపై నిషేధం విధించింది. ప్ర‌స్తుతం కోవిడ్ పరిస్థితులు లేక‌పోవ‌డంతో ఈ వెసులుబాటును పున‌రుద్ధరించాల‌ని బీసీసీఐ భావిస్తోంది. ఈక్ర‌మంలో గురువారం జ‌రిగే కెప్టెన్ల స‌మావేశంలో దీనిపై చ‌ర్చించే అవ‌కాశ‌ముంది. ఏకాభిప్రాయం వ‌స్తే దీనిపై సానుకూల నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశ‌ముంది. 


డిమాండ్ చేస్తున్న ప్లేయ‌ర్లు..
కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో స‌లైవా వాడటంపై నిషేధం విధించార‌ని, ఇప్పుడు ప‌రిస్థితులు మెరుగు ప‌డిన నేప‌థ్యంలో తిరిగి ఆ వెసులుబాటును క‌ల్పించాల‌ని ప‌లువురు క్రికెట‌ర్లు కోరుతున్నారు. భార‌త్ వెట‌ర‌న్ మ‌హ్మ‌ద్ ష‌మీ, సౌతాఫ్రికా మాజీ పేస‌ర్ వెర్నన్ ఫిలాండ‌ర్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ టిమ్ సౌతీ ఈ వెసులుబాటును క‌లిపించాల‌ని ఐసీసీని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్లో ఈ వెసులుబాటును క‌ల్పించ‌డం, చాలామంది బౌల‌ర్లు ఊర‌ట క‌లిగించ‌నుంది. నిజానికి టెస్టుల్లో ఈ వెసులుబాటు వ‌ల్ల ఎక్కువ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. అయితే వైట్ బాల్ క్రికెట్లో కూడా ఎంతో కొంత ప్ర‌యోజనం ఉంటుంద‌నే నేప‌థ్యంలోనే ఐపీఎల్ యాజ‌మాన్యం ఈ నిర్ణ‌యం వైపు మొగ్గు చూపిందనే టాక్ న‌డుస్తోంది. 


మ‌రో కొత్త వెసులుబాటు..
ఇప్ప‌టివ‌ర‌కు డీఆరెస్ అంటే డెసిష‌న్ రివ్యూ సిస్ట‌మ్ ను కేవ‌లం ఔట్, నాటౌట్ , నోబాల్, వైడ్ బాల్ వ‌ర‌కే లీగ్ లో వాడేవారు. ఈ ఎడిష‌న్ నుంచి హైట్ వైడ్ బాల్ కు కూడా వాడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బ్యాట‌ర్ పై నుంచి బంతి వెళ్లిన‌ప్పుడు అది వైడ్ బాల్, అవునో కాదో తేల్చేందుకు డీఆరెస్ ను వాడేందుకు ఆట‌గాళ్ల‌కు అనుమ‌తి ల‌భించ‌నుంది. ఈ క్ర‌మంలో ఆట మ‌రింత ఆస‌క్తిగా మార‌నుంది. తాజాగా ఈ నిబంధ‌న గురించి కూడా మీటింగ్ లో చ‌ర్చించే అవ‌కాశ‌ముంది. అన్నీ అనుకున్న‌ట్లుగా జ‌రిగితే, ఈ నిబంధ‌న‌ను అమలు ప‌రిచే అవ‌కాశాలే ఎక్కువ‌గాఉన్నాయి. ఈనెల 22 నుంచి ఐపీఎల్ ప్రారంభ‌మ‌వుతుండ‌గా, తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ కోల్ క‌తా నైట్ రైడర్స్ తో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు.. కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా త‌ల‌ప‌డ‌నుంది.