IPL 2025 Axar Patel Fined: ముంబై ఇండియన్స్ చేతిలో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి నిరాశలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ పై రూ.12 లక్షల జరిమానాను బీసీసీఐ విధించింది. మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేసినందుకుగాను, అతడిపై కొరడా ఝళిపించింది. ఈ సీజన్ లో ఢిల్లికిది తొలి తప్పే కాబట్టి, జరిమానాను విధిస్తున్నట్లు పేర్కొంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.22ను అతిక్రమించినందుకుగాను ఢిల్లీ కెప్టెన్ కు ఈ శిక్ష పడింది. ఇక నాలుగు వరుస విజయాలతో జోరుమీదున్న ఢిల్లీకి ఒరిజినల్ సొంతగడ్డ అయిన ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో బ్రేక్ పడింది. ఈమ్యాచ్ లో 12 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓడిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ స్టన్నింగ్ ఫిఫ్టీ (59) తో సత్తా చాటాడు. విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ లో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకు అలౌట్ అయింది. కరుణ్ నాయర్ మెరుపు ఫిఫ్టీ (89) తో ఇంపాక్ట్ చూపించినా, జట్టును గెలిపించ లేక పోయాడు.. బౌలర్లలో కర్ణ్ శర్మకు 3 వికెట్లు దక్కాయి.
టర్నింగ్ పాయింట్..
మ్యాచ్ లో ఢిల్లీ ఛేదనలో 11 వ ఓవర్ తర్వాత బంతిని మార్చడంతో ముంబై లక్ మారింది. అప్పటివరకు ఓపికగా ఆడుతున్న కరుణ్ తోపాటు, అక్షర్, ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్ రాహుల్ త్వరగా ఔటయ్యారు. దీంతో ఈ సీజన్ లో తొలి ఓటమిని ఢిల్లీ మూటగట్టుకుంది. నిజానికి ప్రత్యామ్నాయ సొంతగడ్డ అయిన విశాఖ పట్నంలో ఆడిన రెండు మ్యాచ్ లు గెలిచిన ఢిల్లీ.. అరుణ్ జైట్లీ స్టేడియంలో మాత్రం ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో ఇంపాక్ట ప్లేయర్ గా బరిలోకి దిగిన కర్ణ్ శర్మ మూడు వికెట్లతో తన ప్రభావాన్ని చూపించాడు.
ఒక్క చాన్స్ అడిగాడు.. హిట్టయ్యాడు.
మూడేళ్ల కిందట ఒక్కచాన్స్ అని అడిగి, తన టైం కోసం ఎదురు చూసిన కరుణ్.. ఈ మ్యాచ్ లో అవకాశం దక్కగానే రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో తుదిజట్టులో స్థానం దక్కించుకున్న కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 40 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. 12 ఫోర్లు, 5 సిక్సర్లతో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ ఇన్నింగ్స్ తో ఢిల్లీ జట్టులో తను రెగ్యులర్ సభ్యుడు అయిపోతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ బాదిన ఏకైక భారతీయుడు కరుణ్ కావడం విశేషం. అయితే ఆ తర్వాత తనకు అవకాశాలు రాకపోవడంతో, దేశవాళీల్లో టన్నుల కొద్ది పరుగులు సాధించి, తాజాగా ఐపీఎల్ గడప మరోసారి తొక్కాడు. ఈ సీజన్ లో తనను రూ.50 లక్షలకే ఢిల్లీ సొంతం చేసుకోగా, తనకు దక్కిన దానికన్నా ఎన్నో రెట్ల విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ముంబైతో మ్యాచ్ ఓడినా, కరుణ్ రూపంలో నిఖార్సైన బ్యాటర్ టాపార్డర్ లో దొరికాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఐపీఎల్లో సోమవారం లక్నోలో జరిగే మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.