IPL 2025 MI 2nd Win: ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు వరుస ఓటములకు చెక్ పెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్ ను కంగుతినిపించి, టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన లీగ్ మ్యాచ్ లో 12 పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 205 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్, తెలుగు కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ స్టన్నింగ్ ఫిఫ్టీ (33 బంతుల్లో 59, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తో సత్తా చాటాడు. విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్ కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ లో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకు అలౌట్ అయింది. వన్ డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ మెరుపు ఫిఫ్టీ (40 బంతుల్లో 89, 12 ఫోర్లు, 5 సిక్సర్లు)తో ఇంపాక్ట్ చూపించాడు. బౌలర్లలో కర్ణ్ శర్మకు 3 వికెట్లు దక్కాయి. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో 7వ ప్లేస్ కు ముంబై చేరుకుంది. ఢిల్లీ రెండో స్థానానికి పడిపోయింది.
తిలక్ వీరవిహారం..గతంలో తనను రిటైర్డ్ ఔట్ గా పెవిలియన్ కు పంపినప్పటి నుంచి కసిగా ఆడుతున్న తిలక్ ఈ మ్యాచ్ లోనూ తన ధాటిని చూపించాడు. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబైకి మంచి ఆరంభమే దక్కింది. రోహిత్ శర్మ (12) మరోసారి తనకు లభించిన ఆరంభాన్ని వేస్ట్ చేసుకున్నాడు. మరో ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ ర్యాన్ రికెల్టన్ (25 బంతుల్లో 41, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 47 పరుగులు జోడించారు. ఆ తర్వాత సూర్య కుమార్ (40) కూడా కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. రికెల్టన్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన తిలక్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. మూడు కళ్లు చెదిరే సిక్సర్లతో సత్తా చాటాడు. సూర్యతో కలిసి కీలకమైన 60 పరుగులు జోడించాడు. సూర్య ఔటైన తర్వాత నమన్ ధీర్ (38 నాటౌట్) తో కలిసి మరో ముఖ్యమైన భాగస్వామ్యాన్ని తిలక్ నెలకొల్పాడు. ఇక వీరిద్దరూ పోటీపడి పరుగులు సాధిచడంతో ముంబై ఇన్నింగ్స్ తుఫాన్ వేగంతో సాగింది. 200 పరుగుల మార్కుకు చేరింది. చివర్లో 26 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత తిలక్ వెనుదిరిగాడు. నమన్ మాత్రం అజేయంగా నిలిచాడు.
కరుణ్ విధ్వంసం..కాస్త భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీకి ఫస్ట్ బాల్ కే షాక్ తగిలింది. జాక్ ఫ్రేసర్ డకౌటయ్యి, తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. ఈ దశలో ఇంప్టాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన కరుణ్.. తన పవర్ ప్లే చూపించాడు. మైదానం నలువైపులా షాట్లు కొడుతూ ముంబైకి చెమటలు పట్టించాడు. ముఖ్యంగా స్వీచ్ షాట్లు, స్వీప్ షాట్లు ఆడుతూ బౌలర్లను కదురుకోలేకుండా చేశాడు. చాలా వేగంగా ఆడుతూ 22 బంతుల్లోనే ఫిఫ్టీ చేశాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడుతూ సెంచరీ వైపు కదం తొక్కాడు. ఈక్రమంలో అభిషేక్ పొరెల్ (33) తో కలిసి 119 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆరంభంలో స్ట్రైక్ ఎక్కువగా కరుణ్ కే ఇచ్చిన పొరెల్.. తర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ఔటయ్యాడు. ఈ దశలో కరుణ్ కూడా చివరికి శాంట్నర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. వీరిద్దరూ వెనుదిరిగిన తర్వాత ఢిల్లీ మిడిలార్డర్ తడబడింది. కేఎల్ రాహుల్ (15) కూడా ఔట్ కావడంతో విజయంపై ఢిల్లీ ఆశలు సన్నగిల్లాయి. చివర్లో అశుతోష్ శర్మ (17) రనౌట్ కావడం, విప్రజ్ నిగమ్ (14) స్టంపౌట్ కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. మిగతా బౌలర్లలో మిషెల్ శాంట్నర్ కు రెండు వికెట్లు దక్కాయి.