RCB 4th Away Win: ఆర్సీబీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వరుసగా నాలుగో అవే మ్యాచ్ ను గెలుపొందింది. ఆదివారం డబుల్ హెడర్ లో బాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్లతో గెలుపొందింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 173 పరుగులు చేసింది. విధ్వంసక ఓపెనర్ యశస్వి జైస్వాల్ (47 బంతుల్లో 75, 10 ఫోర్లు, 2 సిక్సర్లు)తో ఫామ్ ను దొరకబుచ్చుకుని, టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో క్రునాల్ పాండ్యా పొదుపుగా బౌలింగ్ చేసి, ఒక వికెట్ తీశాడు. అనంతరం ఛేజింగ్ ను ఆర్సీబీ సునాయసంగా పూర్తి చేసింది. 17.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 175 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (45 బంతుల్లో 62 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు ) ఈ ఫార్మాట్లో వందో ఫిఫ్టీని పూర్తి చేశాడు. బౌలర్లలో కుమార్ కార్తికేయకు ఏకైక వికెట్ దక్కింది.
జైస్వాల్ దూకుడు..బ్యాటింగ్ కు కాస్త కష్టంగా ఉన్న పిచ్ పై యశస్వి తన పట్టును చూపించాడు. ఆరంభంలో కాస్త ఆచి తూచి ఆడిన ఈ ఓపెనర్ తర్వాత తన జోరు చూపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (15) త్వరగానే విఫలమైనా, జైస్వాల్ మాత్రం జోరు తగ్గించలేదు. అడపాదడపా బౌండరీలు బాది 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుని, స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ఔటయ్యాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్ (30), ధృవ్ జురెల్ (35) ఫర్వాలేదనిపించారు. యశస్వి మినహా మిగతా బ్యాటర్లు వేగంగా ఆడలేక పోయారు. ఇక బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్ వుడ్ లకు తలో వికెట్ దక్కింది.
సాల్ట్ విధ్వంసం..ఓ మాదిరి టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 65, 5 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ ఆరంభాన్నిచ్చాడు. ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగడంతో పవర్ ప్లేలోనే 65 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కూడా రాయల్స్ బౌలర్లను చితకబాది, కేవలం 28 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 92 పరుగుల వద్ద తను ఔటయ్యాడు. ఈ దశలో కోహ్లీ- దేవదత్ పడిక్కల్ (40 నాటౌట్) జంట ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. రెండో వికెట్ కు 83 పరుగులు చేశాడు. ఈక్రమంలో కోహ్లీ 39 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుని, ఈ ఫార్మాట్లో వందో అర్థ సెంచరీని నమోదు చేశాడు. ఓవరాల్ గా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ 108 ఫిఫ్టీలతో తొలి స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ.. ఈ సీజన్లో నాలుగు అవే మ్యాచ్ లను గెలవడం విశేషం. ఈ విజయంతో 8 పాయింట్లతో టాప్-3కి చేరుకుంది.