IPL CSK vs RCB Match Weather News: శనివారం బెంగుళూరులో జరుగనున్న మ్యాచ్‌ వర్షంతో రద్దయితే బెంగుళూరు ఇంటికి, చెన్నై ప్లే ఆఫ్స్ కి వెళ్తాయి.  ఈ పరిస్థితుల్లో  క్రికెట్ అభిమానులందరి చూపూ చిన్న స్వామి స్టేడియం మీదే ఉంది. ఎందుకో తెలుసా..?   


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తమ హోమ్ గ్రౌండ్ అయిన చిన్న స్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో శనివారం తలపడనుంది.  ఇరు జట్లకు ప్లే ఆఫ్ బెర్తుకోసం ఈ మ్యాచ్ చాలా కీలకం. దీంట్లో గెలిచి ప్లే ఆఫ్ కు అర్హత పొందాలని అటు చెన్నై ఇటు బెంగళూరు రెండూ ఉవ్విళ్లూరుతున్నాయి. పాయింట్ల టేబుల్ లో ప్రస్తుతం 14 పాయింట్లతో మంచి రన్ రేట్‌తో నాలుగో స్థానంలో ఉన్న చెన్నై ఈ మ్యాచ్‌లో సాధారణంగా గెలిచినా, స్వల్ప మార్జిన్‌తో ఓడినా ప్లే ఆఫ్ బెర్తు కన్ఫర్మ్ అవుతుంది  కానీ బెంగుళూరు మాత్రం  ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే పై 18 పరగుల తేడాతో గెలవాలి.  ఒక వేళ ఛేజింగ్ చేస్తే కనీసం 11 బంతులు మిగిలి ఉండగా లక్ష్యాన్ని ఛేదించాలి.   


దారుణంగా మొదలు పెట్టి.. గత అయిదు గేముల్లో అదరగొట్టి.. 


ఈ సీజన్ స్టార్టింగ్ లో అతి దారుణమైన ఆటతీరుతో ఫ్యాన్స్ తో తిట్టించుకున్న ఆర్‌సీబీ గత అయిదు మ్యాచ్‌లు వరసపెట్టి గెలిచింది. ఎస్ ఆర్ హెచ్ తో ఏప్రిల్ 25న జరిగిన మ్యాచ్‌తో స్టార్టయిన విన్నింగ్ స్ట్రీక్‌కు ఇప్పటి వరకు బ్రేకుల్లేవు. ప్రతి మ్యాచ్‌నూ ఆర్‌సీబీ భారీ తేడాతోనే గెలిచి.. నెట్ రన్ రేట్ ను  బాగానే పెంచుకుంది.  ప్రస్తుతం ఆరు విజయాలతో పాయింట్ల టేబుల్‌లో ఆరో స్థానంలో ఆర్‌సీబీ కొనసాగుతోంది. చెన్నైకి ఆర్‌సీబీ కి మధ్య డిల్లీ ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో ఢిల్లీకి ప్లే ఆఫ్‌కు క్వాలిఫై అయ్యే అవకాశం లేదు.  ఇటీవల అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణిస్తోన్న ఆర్‌సీబీ ఈ  మ్యాచ్ ‌లో కూడా విజయం సాధిస్తుందని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు. అందుకు తగ్గట్లే విజయావకాశాల్లో ఆర్‌సీబీకే మొగ్గు ఉంది. కానీ అసలు సమస్య వాతావరణంతో వచ్చింది. 


బెంగుళూరు ఊపు వర్షార్పణం కాకూడదనీ.. 


బెంగుళూరులో శనివారం రాత్రి చెన్నై, బెంగుళూరు మ్యాచ్ జరుగనుంది. అయితే.. బెంగుళూరులో శనివారం వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అని బెంగుళూరు ఫ్యాన్స్ భయపడుతున్నారు. 75 శాతం వర్షం పడే అవకాశం ఉందని వెదర్ ఫోర్‌కాస్ట్ చెబుతోంది. ఒక వేళ ఈ మ్యాచ్ గనక జరగక పోతే బెంగుళూరుకు చెన్నైకు తలో పాయింట్ వస్తాయి. ఇక దాంతో బెంగుళూరు కథ ముగిసినట్లే.  అన్నీ సర్దుకుని ఇంటికెళ్లాలి. 13 పాయింట్లతో ప్లే ఆప్ రేసు నుంచి తప్పుకోక తప్పదు. 15 పాయింట్లతో చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. కానీ మంచి ఊపు మీదున్న ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి వెళ్లాలనే సగటు క్రికెట్ అభిమాని కోరిక. కనీసం మ్యాచ్ అయినా జరగాలని కోరుకుంటున్నారు.  


స్టేడియం ఆదుకుంటుందా..? 


శనివారం ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వెదర్ ఫోర్ కాస్ట్ చెబుతుంది. ఇదే జరిగితే.. చిన్న స్వామి స్టేడియమే బెంగుళూరు పాలిట దేవుడు కానుంది. దేశంలోనే చిన్న స్వామి స్టేడియానికి ప్రత్యేక మైన గుర్తింపు ఉంది. ఒక వేళ వర్షం పడినా.. స్టేడియం అవుట్ ఫీల్డ్ నిండా నీరు నిలిచి పోయినా.. కేవలం 15 నిమిషాల్లో స్టేడియాన్ని తిరిగి ఆటకి అనువుగా రెడీ చేసే డ్రైనేజి సిస్టం చిన్న స్వామి స్టేడియంలో ఉంది.


ఏంటీ డ్రైనేజీ సిస్టం.. 


2017లో కర్ణాటక స్టేట్  క్రికెట్ అసోసియేషన్ (కేకేఎస్ఏ) ఈ స్టేడియానికి సబ్‌ సర్ఫేస్ ఎయిరేషన్ , వ్యాక్యూమ్ పవర్డ్ డ్రైనేజి సిస్టమ్ ను ఇన్స్టాల్ చేశారు. దాదాపు 4.5 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ సిస్టమ్ ద్వారా.. వర్షం పడి నిలిచిన నీరు క్షణాల్లోనే గ్రౌండ్ నుంచి బయటకి వెళ్లిపోతుంది. సాధారణంగా ఎంత సమయం పడుతుందో దానికంటే 36 రెట్లు వేగంగా ఈ డ్రైనేజి సిస్టం ద్వారా నీటిని బయటకు పంపవచ్చు. దీనికోసం గ్రౌండ్ అడుగు భాగంలో కిలోమీటర్ల మేర పైపులు ఏర్పాటు చేసి.. సబ్ మెర్సిబుల్ మోటర్ల ద్వారా గ్రౌండ్లోని వాటర్ అంతా బయటకి లాగేస్తారు. సెన్సార్ల ద్వారా ఈ మోటర్లు ఆన్ అవ్వగానే భూమి  లోపలకి నీటిని పీల్చుకోవడం, క్షణాల్లో చూస్తుండగానే నీరంతా ఇంకి పోవడం వింతగా కనిపిస్తుంది. పిచ్ మీద, గ్రౌండ్‌లో మాయిశ్చర్ లెవల్ ఈవెన్‌గా ఆటకు అనువుగా మెయింటేన్ చేసేందుకు సైతం ఈ సిస్టం ఉపయోగపడుతుందట.  దీని నిర్వహణకే ఏటా ఏడు లక్షలు ఖర్చవుతుందట.   ఈ ప్రత్యేకతలున్న చిన్న స్వామి స్టేడియం బెంగుళూరును ఆదుకుంటుందేమో చూడాలి.