IPL 2025 Ashutosh Sharma News: అశుతోష్ ను అక్క‌డ ఆడించండి.. మీ ద‌శ తిరిగి పోతుంది.. క‌ప్ ప‌క్కా.. ఢిల్లీకి మాజీ క్రికెట‌ర్ సూచ‌న‌

ఢిల్లీ బ్యాట‌ర్ అశుతోష్ శ‌ర్మ సంచ‌ల‌న బ్యాటింగ్ తో ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాడు. తాజాగా త‌న బ్యాటింగ్ ఆర్డ‌ర్ మారిస్తే, ఢిల్లీ ద‌శ తిరుగుతుంద‌ని భార‌త మాజీ క్రికెట‌ర్ వ్యాఖ్యానించాడు.

Continues below advertisement

IPL 2025 DC VS LSG Updates: మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాట‌ర్ అశుతోష్ శ‌ర్మ‌పై ప్ర‌శంస‌లు జ‌ల్లు కురుస్తుంది. తాజాగా అత‌ని కోచ్, భార‌త మాజీ క్రికెట‌ర్ అమే కురేసియా.. ఢిల్లీ కి కొన్ని సూచ‌న‌లు చేశాడు. ఐపీఎల్లో తొలి టైటిల్ సాధించాలంటే అశుతోష్ ను ఓపెనింగ్ లో ఆడించాల‌ని సూచించాడు. అప్పుడే ఢిల్లీ క‌ప్పు కొట్ట‌గ‌ల‌ద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. అశుతోష్ కంప్లీట్ బ్యాట‌ర‌ని, అత‌డు అన్ని ర‌కాల షాట్లు ఆడ‌గ‌ల‌డ‌ని వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా త‌న‌ను ఓపెన‌ర్ గా పంపిస్తే ఫ్రంట్ ఫుట్ పై హుక్ షాట్, బ్యాక్ పుట్ పై క‌ట్ షాట్, స్కూప్ షాట్లు ఇలా ఏ ర‌క‌మైన క్రికెట్ అయిన ఆడ‌గ‌ల‌డ‌ని పేర్కొన్నాడు. ఇప్ప‌టికైనా త‌న‌కు ప్ర‌మోష‌న్ క‌ల్పించి, త‌నను టాపార్డ‌ర్ లో ఆడిస్తే బాగుంటుంద‌ని పేర్కొన్నాడు. ఐపీఎల్ లాంటి మెగా వేదికపై 113-6తో నిలిచిన దశలో భారీ స్కోరును ఛేదించిన అశుతోష్ శర్మ లాంటి ఆటగాడిని భారత జాతీయ జట్టులోకి తీసుకోవాలని పేర్కొన్నాడు.  ఇక 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న ఢిల్లీ జ‌ట్టు తొలుత ఢిల్లీ డేర్ డెవిల్స్ గా బ‌రిలోకి దిగి, త‌ర్వాత ఢిల్లీ క్యాపిట‌ల్స్ గా మారింది. అయిన‌ప్ప‌టికీ టైటిల్ సాధించ‌లేక పోయింది. 

Continues below advertisement

మ‌ధ్య ప్ర‌దేశ్ నుంచి..
నిజానికి అశుతోష్ ది మ‌ధ్య ప్ర‌దేశ్ లోని ర‌త్నాం జిల్లా. తొలుత కురేసియా అకాడమీ నుంచి ఓన‌మాలు దిద్దుకున్న అశుతోష్ ఆ త‌ర్వాత మ‌ధ్య ప్ర‌దేశ్ త‌ర‌పున వివిధ జ‌ట్ల‌లో ఆడాడు. అయితే కావాల్సిన‌న్ని అవ‌కాశాలు ల‌భించ‌క‌పోవ‌డంతో త‌ను రైల్వేస్ కు మారాడు. అప్ప‌టి నుంచి త‌న ద‌శ తిరిగి పోయింది. రెండేళ్ల కింద‌ట టీ20ల్లో 11 బంతుల్లోనే ఫిఫ్టీ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. దీంతో భార‌త వెట‌ర‌న్ ప్లేయ‌ర్ యువ‌రాజ్ సింగ్ న‌మోదుచేసిన 12 బంతుల్లో ఫిఫ్టీ రికార్డు బ‌ద్ద‌లైంది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ పై అశుతోష్ ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అందరి ఫోకస్ అతనిపై పడి, ఐపీఎల్లోకి ఎంట్రీకి దారి తీసింది. 

అశుతోష్ పై న‌మ్మ‌క‌ముంచిన ఢిల్లీ..
నిజానికి సోమ‌వారం మ్యాచ్ లో ఢిల్లీ కోచ్ కెవిన్ పీట‌ర్స‌న్.. అశుతోష్, విప్ర‌జ్ నిగ‌మ్ ల‌పై విశ్వాసం ఉంచాడు. వారిద్ద‌రూ ఔట‌వ‌నంత వ‌ర‌కు మ్యాచ్ ఢిల్లీ చేతుల్లోనే ఉంద‌ని వ్యాఖ్యానించాడు. పీట‌ర్స‌న్ చెప్పిన‌ట్లుగానే వీరిద్ద‌రూ మ్యాచ్ ను మ‌లుపు తిప్పారు. తొలుత విప్ర‌జ్ మెరుపు క్యామియో ఆడ‌గా, ఆ త‌ర్వాత అశుతోష్ ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చి మ్యాచ్ ను కంప్లీట్ చేశాడు. ఇక ఈ వేలంలో అశుతోష్ ను కొనుగోలు చేయ‌డం, త‌మ బెస్ట్ మూవ్ అని ఢిల్లీ క్యాపిట‌ల్స్ యాజ‌మాన్యం వ్యాఖ్యానించింది. అందుకు త‌గినట్లుగానే అశుతోష్ త‌న స‌త్తా చాటాడు. తనను 3.8 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది.  మ‌రీ మున్ముందు త‌న‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చి టాపార్డ‌ర్ లో ఆడిస్తుందేమో చూడాలి.  

Continues below advertisement
Sponsored Links by Taboola