IPL 2025 PBKS VS GT Updates: పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్, 5 ఫోర్లు, 9 సిక్సర్లు) దుమ్ము రేపాడు. ఈ సీజన్ లో ఐపీఎల్లో తన అత్యధిక స్కోరును సమం చేశాడు. అలాగే ఈ సీజన్ లో రెండో అత్యధిక స్కోరును నమోదు చేశాడు. మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో వీర బాదుడు బాదిన శ్రేయస్.. గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి బౌలింగ్ చేయాలనుకున్న టైటాన్స్ నిర్ణయం బెడిసి కొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. శుభారంభం లభించకపోయినా, శ్రేయస్, శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 పరుగులు నాటౌట్, ఆరు ఫోర్లు, 2 సిక్సర్లు) చలవతోనే భీకర స్కోరును పంజాబ్ సాధించింది. నిజానికి ఒక వైపు వికెట్లు పడుతున్నా, కెప్టెన్ గా తను ముందుకు నడిచి, ఏకంగా 9 సిక్సర్లతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఇక ఈ మ్యాచ్ లో వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన శ్రేయస్.. ఆది నుంచి చితక్కొట్టడమే మంత్రంగా బ్యాటింగ్ చేశాడు. మైదానం అన్ని వైపులా బౌండరీలు బాదుతూ 27 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. ఇక ఫిఫ్టీ అయిన తర్వాత సెంచరీ వైపు తుఫాన్ వేగంతో చేరాడు. ఎక్కువగా భారీ సిక్సర్లు బాదుతూ తన దైన స్టైల్లో శ్రేయస్ సెంచరీకి చేరువలో చేరుకున్నాడు. అయితే చివర్లో శశాంక్ విజృంభణతో శశాంక్ కు సెంచరీ చేసుకునే అవకాశం లభించలేదు. అలాగే శశాంక్ ను ప్రొత్సహిస్తూ, తన సెంచరీ కంటే జట్టుకు భారీ స్కోరే ముఖ్యమని తననే స్ట్రైక్ ను అట్టి పెట్టుకోమని సూచించాడు.
శశాంక్ వీరంగం..తన మీద పంజాబ్ పెట్టుకున్న నమ్మకాన్ని శశాంక్ సింగ్ నిలబెట్టుకున్నాడు. గతేడాది అనుకోకుండా వేరే శశాంక్ కు కొనబోయి, ప్రస్తుత శశాంక్ సింగ్ న పంజాబ్ అనూహ్యంగా కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో పలు మ్యాచ్ ల్లో పంజాబ్ కు మ్యాచ్ విన్నర్ గా శశాంక్ నిలిచాడు. దీంతో ఈ సీజన్ లో తనను పంజాబ్ రీటైన్ చేసుకుంది. తను అన్ క్యాప్డ్ ప్లేయర్ కావడంతో రూ.5.5 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే కేవలం 16 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు, 2 సిక్సర్లతో అదరగొట్టాడు. తన చివరి ఓవర్లలో విజృంభణతో పంజాబ్ అనుకున్నదాని కంటే భారీ స్కోరును సాధించింది.
ప్రియాంశ్ ధనాధన్.. ఇక టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. గత సీజన్ లో అంతంతమాత్రంగానే రాణించినా, తనపై నమ్మకం పెట్టుకుని రిటైన్ చేసుకున్న పంజాబ్ కు ప్రభు సిమ్రాన్ సింగ్ (5) షాకిచ్చాడు. నాలుగో ఓవర్లో తను వెనుదిరిగాడు. ఈ దశలో కుర్ర ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 47, 7 ఫోర్లు, 2 సిక్సర్లు)తో సత్తా చాటాడు. పంజాబ్ కోరుకున్న ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత శ్రేయస్ దాన్ని కొనసాగించాడు. మధ్యలో అజ్మతుల్లా ఓమర్ జాయ్ (16), గ్లెన్ మ్యాక్స్ వెల్ డకౌట్ విఫలమైనా, శ్రేయస్, శశాంక్ జోరుతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. బౌలర్లలో సాయి కిశోర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఒక దశలో హ్యాట్రిక్ పై నిలిచిన సాయి కిశోర్.. ఆశలను మార్కస్ స్టొయినిస్ (20) వమ్ము చేశాడు.