IPL Cricket Betting News | హైదరాబాద్: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ మరో యువకుడిని బలి తీసుకున్నాయి. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.
గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ అనే 29 ఏళ్ల యువకుడికి క్రికెట్ అంటే పిచ్చి. దాంతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌లో క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్ వేసి రూ. 2 లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పులు తీర్చలేక, ఇటు , మనోవేదనకు గురవుతున్న యువకుడు క్షణికావేశంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. గౌడవెల్లి పరిధిలో మంగళవారం రైలు పట్టాలపై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై కేసులు నమోదు చేసి నోటీసులు ఇచ్చింది. దీనిపై యాంకర్లు శ్యామల, విష్ణుప్రియ, రీతూచౌదరి సహా పలువురు పంజాగుట్ట పీఎస్ లో విచారణకు హాజరయ్యారు. వారు ఇచ్చిన సమాచారంతో మరింత లోతుగా బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు జరుగుతోంది.