IPL 2025 RCB VS DC Updates: ఈ సీజన్ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. వరుసగా 6 అవే మ్యాచ్ లు గెలుపొంది కొత్త రికార్డును నెలకొల్పింది. 18 ఏళ్ల ఐపీఎల్ కెరీర్ లో ఈ ఘనత సాధించిన మరో జట్టు లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ విజయంలో అటు బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, క్రునాల్ పాండ్యా, ఇటు బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్ వుడ్ సత్తా చాటారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. టీ20 క్రికెట్ లో భాగస్వామ్యాల ఇంపార్టెన్స్ ను అందరూ మరిచిపోయారని పేర్కొన్నాడు. తన మటుకైతే, మ్యాచ్ కు తగినట్లుగా ఆటతీరును మలుచుకుని ఆడతానని పేర్కొన్నాడు.ఈ మ్యాచ్ లో 47 బంతుల్లో 51 పరుగులు చేసి, క్రునాల్ తో కీలక భాగస్వామ్యం కోహ్లీ నెలకొల్పాడు. ఒకదశలో 26/3 తో ఆర్సీబీ నిలిచిన దశలో వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 119 పరుగులు జోడించి, మ్యాచ్ ను ఢిల్లీ నుంచి లాగేసుకున్నారు. 73 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో క్రునాల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.
జట్టు కూర్పు అద్భుతంగా ఉంది..ఈ మ్యాచ్ లో సమష్టి ఆటతీరుతోనే గెలుపొందామని కోహ్లీ పేర్కొన్నాడు. ముందుగా బౌలర్లు తమ పాత్రను పోషించి, ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశారని కొనియాడాడు. భువీ, హేజల్ వుడ్ కీలక వికెట్లు తీశారని, సుయాశ్ శర్మ వికెట్లు తీయకపోయినా, ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడని, క్రునాల్ టైట్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడని కొనియాడు. ఈ మ్యాచ్ లో టాపార్డర్ విఫలమైన వేళ, క్రునాల్ సత్తా చాటాడని, అతని నుంచి ఇలాంటి ఇన్నింగ్సే ఆశించామని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో తను చాన్స్ లు తీసుకుంటానని చెప్పాడని, నన్ను స్ట్రైక్ రొటేట్ చేస్తే చాలని చెప్పినట్లు తెలిపాడు. ఇక బ్యాటింగ్ చివర్లో టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్ లాంటి విధ్వంసక హిట్టర్లు ఉండటంతో మ్యాచ్ గురించి టెన్షనేమీ లేదని పేర్కొన్నాడు. తన ఇన్నింగ్స్ తో ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచిన కోహ్లీ.. ఆరెంజ్ క్యాప్ ను, అత్యధిక వికెట్లు తీసిన హేజిల్ వుడ్ పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత కేఎల్ రాహుల్ ను టీజ్ చేస్తూ కాంతారా స్టైల్ సెలెబ్రేషన్స్ న కోహ్లీ చేశాడు.
నా రోల్ క్లియర్..జట్టులో తన పాత్రపై స్పష్టమైన అవగాహన ఉందని, మూడు వికెట్లు పడిన తర్వాత మంచి భాగస్వామ్యాలు నెలకొల్పానని చూసినట్లు క్రునాల్ వివరించాడు. ఈ మ్యాచ్ లో తొలి 20 బంతులు కాస్త కష్టపడ్డానని, ఈ దశలో కోహ్లీ తనను బ్యాక్ చేశాడని, ఈ ఇన్నింగ్స్ ఘనత అతనికే చెందుతుందని పేర్కొన్నాడు. ఇక బౌలింగ్ లోనూ కఠోర శ్రమ చేస్తున్నానని, ప్రతి మ్యాచ్ లో ఎకానమీకల్ బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో గెలుపొందిన ఆర్సీబీ.. 7 విజయాలతో ప్లే ఆఫ్ బెర్తుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ సీజన్ లో 7 విజయాలు సాధించిన తొలి జట్టుగా కూడా నిలిచింది.