IPL 2025 RCB 7th Victory: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతం చేసింది. ఈ సీజన్ లో ఏడో విక్టరీతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కైవసం చేసుకుంది. ఆదివారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్లతో విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ సవాలు విసిరే స్కోరును చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 41, 3 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో ఆర్సీబీ.. 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఆల్ రౌండర్ క్రునాల్ పాండ్యా ( 47 బంతుల్లో 73 నాటౌట్, 5 ఫోర్లు, 4 సిక్సర్లు 1/28) ఇటు బంతితోనూ, అటు బ్యాట్ తో సత్తా చాటాడు. అక్షర్ పటేల్ కు రెండు వికెట్లు దక్కాయి. తాజా ప్రదర్శనతో ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ.. ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.
ఓపెనర్ల శుభారంభం.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (28), ఫాఫ్ డుప్లెసిస్ (22) చక్కని ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా పోరెల్ దూకుడుగా ఆడటంతో పది పరుగుల రన్ రేట్ తో స్కోరు బోర్డు సాగింది. అతను ఔటైన తర్వాత కరుణ్ నాయర్ (4) మరోసారి విఫలమయ్యాడు. ఈ దశలో రాహుల్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్ కు కాస్త కష్టమైన ఈ వికెట్ పై తన క్లాస్ చూపించాడు. తొలుత డుప్లెసిస్ తో చిన్న భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రాహుల్.. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లతో కలిసి విలువైన పార్ట్నర్ షిప్ నమోదు చేశాడు. అయితే అతను ఔటైన తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ (34) చాలా వేగంగా ఆడటంతో స్కోరు 160 పరుగుల మార్కును దాటింది. మిగతా బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ కి రెండు వికెట్లు దక్కాయి.
హారీబుల్ పవర్ ప్లే..ఓ మాదిరి టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు ఓవర్ల లోపలే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కొత్త ఓపెనర్ జాకబ్ బెతెల్ (12), దేవదత్ పడిక్కల్ డకౌట్, కెప్టెన్ రజత్ పతిదార్ (6) త్వరగా ఔట్ కావడంతో 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (47 బంతుల్లో 51, 4 ఫోర్లు) తన జాదూను చూపించాడు. క్రునాల్ పాండ్యాతో కలిసి కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ ను ఢిల్లీ నుంచి లాగేసుకున్నాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జంట.. తర్వాత బౌండరీలతో రెచ్చిపోయింది. ఆతిథ్య బౌలర్లను ఓ ఆటాడుకుని సెంచరీకిపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. నాలుగో వికెట్ కు 119 పరుగులు జోడించడంతో మ్యాచ్ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. ఈ క్రమంలో ఫస్ట్ క్రునాల్ 38 బంతుల్లో, ఆ తర్వాత విరాట్ 45 బంతుల్లో ఫిఫ్టీలని పూర్తి చేశారు. ఆ తర్వాత కోహ్లీ ఔటైనా.. క్రునాల్ చివరికంటా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. టిమ్ డేవిడ్ (19 నాటౌట్) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.