IPL 2025 MI 5th Consecutive Victory: జోరుమీదున్న ముంబై దూసూకుపోతోంది. వరుసగా ఐదో విజయంతో ఈ సీజన్ లో సత్తా చాటింది. ఆదివారం సొంతగడ్డ వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 54 పరుగులతో విజయం సాధించింది. అలాగే ఈ సీజన్ లో ఆరో విజయం సాధించి, టాప్-2 ప్లేస్ కి చేరుకుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ మెరుపు ఫిఫ్టీ (32 బంతుల్లో 58, 6 ఫోర్లు, న4 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన లక్నో.. 161 పరుగులకు ఆలౌట్ అయింది. ఆయుష్ బదోని (22 బంతుల్లో 35, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జస్ ప్రీత్ బుమ్రాకు నాలుగు వికెట్లు దక్కాయి.
మెరుపు ఆరంభం.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబైకి మెరుపు ఆరంభం దక్కింది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (12) రెండు సిక్సర్లు కొట్టి సూపర్ టచ్ లో కనిపించాడు. మరో ఎండ్ లో రికెల్టన్ కూడా రెచ్చిపోవడంతో 2.5 ఓవర్లలోనే 33 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఈ దశలో రోహిత్ ఔటైనా, విల్ జాక్స్ (29) తో కలిసి చక్కని భాగస్వామ్యం జత కలిశాడు. ఇద్దరూ దూకుడే మంత్రంగా బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు ఉరకెలెత్తింది. ఈ క్రమంలో 25 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రికెల్టన్ ఆ తర్వాత వెనుదిరిగాడు. ఈ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ స్టన్నింగ్ ఫిఫ్టీ (28 బంతుల్లో 54, 4 ఫోర్లు, 4 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. మధ్యలో విల్ జాక్స్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (6), హార్దిక్ పాండ్యా (5) విఫలమైనా, నమన్ ధీర్ (25 నాటౌట్) తో కలిసి వీరవిహారం చేశాడు. దూకుడుగా ఆడిన సూర్యకేవలం 27 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తను ఔటైన తర్వాత చివర్లో కార్బిన్ బోష్ (20) వేగంగా ఆడటంతో ముంబై 210+ పరుగులను దాటింది.
బ్యాటింగ్ విఫలం.. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నోకు శుభారంభం దక్కలేదు. సూపర్ ఫామ్ లో ఉన్న ఐడెన్ మార్క్రమ్ (9) త్వరగా ఔటయ్యాడు. ఈ దశలో మిషెల్ మార్ష్ (34), నికోలస్ పూరన్ (27) ఇన్నింగ్స్ ను గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కాస్త వేగంగా ఆడే ప్రయత్నం చేసి, రెండో వికెట్ కు 42 పరుగులు జత చేశారు. ఆ తర్వాత పూరన్ ఔట్ కావడం, కెప్టెన్ రిషభ్ పంత్ (4) విఫలం కావడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో ఆయుష్ బదోని తో కలిసి ఇన్నింగ్స్ ను నిర్మించడానికి మార్ష్ ప్రయత్నించాడు. వీరద్దరూ నాలుగో వికెట్ కు 46 పరుగులు జోడించారు. ఆ తర్వాత మార్ష్ ఔటయ్యాడు. చివర్లో డేవిడ్ మిల్లర్ (24) తో కలిసి బదోని జట్టును గెలిపించేందుకు చివరి ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ వరుస ఓవర్లలో ఔట్ కావడం, అబ్దుల్ సమద్ (2) విఫలం కావడంతో లక్నోకు ఓటమి ఖరారైంది. చివర్లో రవి బిష్ణోయ్ (13) రెండు సిక్సర్లతో అలరించాడు. మిగతా బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ కు మూడు, విల్ జాక్స్ కి రెండు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో ముంబై 150వ ఐపీఎల్ విజయాన్ని నమోదు చేసింది. అలాగే 200 పరుగులు చేసిన ప్రతిసారీ గెలిచిన రికార్డును ముంబై నిలబెట్టుకుంది.