Shubman Gill: టీమ్‌ఇండియా ఆటగాడు శుభ్‌మన్‌ గిల్ గుజరాత్‌ టైటాన్స్‌ను వీడుతున్నాడా? లేదా టైటాన్సే అతడిని వదిలేస్తోందా? ఏం అర్థం కావడం లేదు. వచ్చే సీజన్లో అతడు మరో ఫ్రాంచైజీకి ఆడతాడన్న వార్తలు వస్తున్నాయి. రవీంద్ర జడేజా కోసం అతడిని ట్రేడ్‌ చేస్తున్నారని ఊహగానాలు వెలువడుతున్నాయి. సోషల్‌ మీడియాలో హఠాత్తుగా గిల్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. టైటాన్స్‌ చేసిన క్రిప్టిక్‌ ట్వీటే ఇందుకు కారణం!






'ఇదో గుర్తించుకోదగ్గ జర్నీ! శుభ్‌మన్‌ గిల్‌.. నీ తర్వాతి ప్రయాణం విజయవంతం అవ్వాలని మేం కోరుకుంటున్నాం' అని గుజరాత్‌ టైటాన్స్ సాయంత్రం ట్వీట్‌ చేసింది. ఇందుకు రెండు ఎమోజీలతో గిల్‌ బదులిచ్చాడు. ఒక హార్ట్‌, హగ్‌ ఎమోజీ పోస్టు చేశాడు. దీంతో ఊహాగానాలు మొదలయ్యాయి.




ఐపీఎల్‌ సీజన్లో శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతంగా రాణించాడు. ఒకప్పట్లా కాకుండా దూకుడుగా ఓపెనింగ్‌ చేశాడు. అలాగే ట్రిక్కీ వికెట్లపై నిలకడగా బ్యాటింగ్‌ చేశాడు. తన ఆటను మరింత మెరుగు పర్చుకున్నాడు. అంత సులభంగా వికెట్ ఇవ్వలేదు. గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. 132.33 స్ట్రైక్‌రేట్‌, 34.50 సగటుతో 483 పరుగులు చేశాడు. నాలుగు హాఫ్‌ సెంచరీలు కొట్టాడు. రాజస్థాన్‌ రాయల్స్‌తో టైటిల్‌ పోరులో 131 పరుగుల ఛేదనలో 45 (43) పరుగులతో అజేయంగా నిలిచాడు.




ఈ సీజన్లోనే అరంగేట్రం చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ అత్యంత తెలివిగా ఆటగాళ్లను తీసుకుంది. రిజర్వు ప్లేయర్లుగా హార్దిక్‌ పాండ్య, శుభ్‌మన్‌ గిల్‌, రషీద్‌ ఖాన్‌ను ఎంచుకుంది. అలాంటిది ఇప్పుడు అతడిని వదిలేస్తుందంటే ఎవరూ నమ్మేలా అనిపించడం లేదు. కొన్ని అనూహ్య సమీకరణాలు ప్రకారం అసాధ్యమైతే కాదు! రవీంద్ర జడేజాను తీసుకొనేందుకు గిల్‌ను సీఎస్‌కేకు వదిలేస్తుందని ఒక టాక్‌. ధోనీసేన బ్యాటింగ్‌ ఆర్డర్లో సమస్యలకు అతడు పరిష్కారం చూపగలడు. రుతురాజ్‌తో ఓపెనింగ్‌ చేస్తాడు. మరికొందరేమో తిరిగి కోల్‌కతాకు వచ్చేయాలని కోరుతున్నారు. ఇంకొందరైతే సన్‌రైజర్స్‌కు వస్తాడని ఆశిస్తున్నారు. ఎందుకంటే గిల్‌, అభిషేక్‌ దేశవాళీ క్రికెట్లో పంజాబ్‌కు ఓపెనింగ్‌ చేస్తారు. ఏం జరుగుతుందో చూడాలి!!