ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సరికొత్త సీజన్‌ భారత్‌లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబయి నగరం సీజన్‌కు ఆతిథ్యం ఇవ్వనుందని తెలిసింది. అభిమానులకు అనుమతి లేకుండా కట్టుదిట్టమైన బయో బుడగలను ఇక్కడ సృష్టిస్తారు. వాంఖడే, డీవై పాటిల్‌, క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (CCI)లో మ్యాచులు నిర్వహిస్తారని బీసీసీఐ వర్గాలు మీడియాకు తెలిపాయి. అవసరమైతే పుణెను ప్రత్యామ్నాయ వేదికగా ఉపయోగించుకుంటారు.


నేడు ఐపీఎల్‌ స్టేక్‌ హోల్డర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఐపీఎల్‌ పాలక మండలితో ఫ్రాంచైజీలన్నీ సమావేశం అయ్యాయి. అహ్మదాబాద్‌, లక్నో ఫ్రాంచైజీలను  పరిచయం చేశారని తెలిసింది. మ్యాచుల షెడ్యూలు, వేదికలు, ఆటగాళ్ల వేలం గురించి చర్చించారని సమాచారం. ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ మూడో వేవ్‌ కొనసాగుతోంది. రోజూ లక్షల్లో కేసులు వస్తున్నాయి. ప్రాణాపాయ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ వ్యాప్తి మాత్రం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సీజన్‌ను ఎక్కడ నిర్వహించాలని బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. సాధ్యమైనంత వరకు భారత్‌లోనే నిర్వహించేందుకు మొగ్గు చూపుతోంది. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకుంటే వేదికను దక్షిణాఫ్రికాకు తరలించాలని భావిస్తోందని తెలిసింది. గత రెండు సీజన్లకు ఆతిథ్యమిచ్చిన యూఏఈపై బోర్డుకు ఆసక్తి లేదని సమాచారం.






'ఐపీఎల్‌ను మేం భారత్‌లోనే నిర్వహించాలని పట్టుదలతో ఉన్నాం. ఒకవేళ పరిస్థితి మరీ దిగజారితే విదేశాల గురించి ఆలోచిస్తాం. ఇప్పటికైతే స్వదేశంలో ఆతిథ్యానికే మా ప్రాధాన్యం. ఫిబ్రవరిలో తుది నిర్ణయం తీసుకుంటాం' అని బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్‌ స్పోర్ట్‌కు తెలిపారు. నేటి సమావేశంలో వేదికపై సుదీర్ఘంగా చర్చ జరపనున్నారు. బ్యాకప్‌ వేదికగా దక్షిణాఫ్రికాను ఎంచుకుంటారని తెలిసింది.


ముంబయి నగరాన్నే వేదికగా ఎంచుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన స్టేడియాలు మూడు ఉన్నాయి. వాంఖడే ఇప్పటికే చాలా అంతర్జాతీయ మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చింది. 25 టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20లు నిర్వహించారు. ఇక ప్రతి సీజన్లో ఐపీఎల్‌ మ్యాచులు జరుగుతుంటాయి. డీవై పాటిల్‌ స్టేడియంలోనూ నిరంతరం మ్యాచులు నిర్వహిస్తుంటారు. క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా స్టేడియాన్ని బ్రబౌర్న్‌గా పిలుస్తారు. ఇక్కడ 18 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20లు జరిగాయి. ఇక ముంబయిలో ఫైవ్‌ స్టార్ హోటళ్లూ, విల్లాలూ ఎక్కువే. ప్రత్యేకంగా బయో బుడగలను ఏర్పాటు చేయొచ్చు. అందుకే ముంబయికే బీసీసీఐ ప్రాధాన్యం ఇస్తోంది.


Also Read: Ind vs SA, Innings Highlights: అయిపాయే.. రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి.. సిరీస్ కూడా!


Also Read: IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?


Also Read: David Warner: పుష్పని వదలని వార్నర్.. తర్వాతి ఐపీఎల్ ఫ్రాంచైజీకి హింట్ ఇచ్చాడా?