టీమ్‌ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ నుంచి విడిపోతున్నాడని తెలిసింది. వచ్చే సీజన్‌కు అతడు వేలంలోకి రావాలని కోరుకుంటున్నాడు. అంతేకాకుండా మూడు, నాలుగు ఫ్రాంచైజీలు సైతం అతడితో చర్చలు జరిపాయని సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగులో రాహుల్‌కు అద్భుతమైన రికార్డుంది. ఇప్పటి వరకు 94 మ్యాచులు ఆడిన అతడు 47.43 సగటు, 136.37 స్ట్రైక్‌రేట్‌తో 3,273 పరుగులు చేశాడు. 2018 నుంచి అతడు 600కు తక్కువ కాకుండా పరుగులు చేశాడు. ఇక పంజాబ్ కింగ్స్‌కు ఎంపికైనప్పటి నుంచి వీరోచితంగా ఆడుతున్నాడు. టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నాడు. కెప్టెన్‌గానూ అలరిస్తున్నాడు. చివరి నాలుగు సీజన్లలో అతడు వరుసగా 659, 593, 670, 626 పరుగులు చేశాడు.
Also Read: అయ్యో ఆర్సీబీ.. ‘ఈ సాల’ కూడా కప్పు మిస్.. ఎలిమినేటర్‌లో కోల్‌కతా విజయం!
పంజాబ్ కింగ్స్‌లో అతడికి తిరుగులేదు. ఇబ్బందులూ లేవు. కానీ అతడు ఆ జట్టుతో బంధం తెంచుకోవాలని భావిస్తున్నాడని తెలిసింది. వచ్చే సీజన్‌కు మరో రెండు కొత్త జట్లు రానున్నాయి. మంచి క్రికెటర్లకు ఎక్కువ ధర పలికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే రెండు, మూడు ఫ్రాంచైజీలు అతడితో చర్చలు జరిపాయనీ అంటున్నారు. ఒకవేళ గనక రాహుల్ వేలంలోకి వస్తే అందరికన్నా ఎక్కువ ధర పలుకుతాడని, రికార్డులు బద్దలు కొడతాడని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: ప్రపంచ క్రికెట్‌ను భారత్ శాసిస్తోంది.. బీసీసీఐ మాటే నెగ్గుతుంది: ఇమ్రాన్ ఖాన్
కేఎల్ రాహుల్ స్వస్థలం బెంగళూరు. దేశవాళీ క్రికెట్లో అతడు కర్ణాటకకు ఆడతాడు. బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటి వరకు ఆ జట్టు ట్రోఫీ గెలిచిందే లేదు. పైగా ఇప్పుడు కోహ్లీ కెప్టెన్‌గా దిగిపోతున్నాడు. అతడితో రాహుల్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. పైగా స్థానికుడు కావడంతో ఆర్‌సీబీ అతడిని దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తోందని ఆయా వర్గాల ద్వారా తెలిసింది.
Also Read: ధోని నామస్మరణతో షేక్ అయిన సోషల్‌మీడియా.. స్టార్ హీరోలు కూడా ఫ్యాన్స్ అయిపోయిన వేళ!
వచ్చే సీజన్ కోసం బీసీసీఐ మెగా వేలం నిర్వహించనుంది. అందరు ఆటగాళ్లు వేలం పరిధిలోకి రావాల్సిందే. అట్టిపెట్టుకొనే విషయంపై ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఆర్‌టీఎం ఉపయోగించుకొనే అవకాశం ఇచ్చినా రాహుల్ మాత్రం పక్కకు వెళ్లిపోతాడనే అంటున్నారు. మరి అతడిని ఆర్‌సీబీ దక్కించుకుంటుందా? కొత్త ఫ్రాంచైజీలు ఎంచుకుంటాయా? మరే ఇతర జట్టుకైనా వెళ్తాడా? చూడాలి మరి!