ఐపీఎల్‌లో నేడు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరుపై కోల్‌కతా నాలుగు వికెట్లతో విజయం సాధించింది. దీంతో బెంగళూరు ఈసారి కూడా రిక్తహస్తాలతోనే ఇంటికి వెళ్లింది. 13వ తేదీన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కతా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు చెన్నైతో ఫైనల్స్ ఆడనుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో.. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.


పూర్తిగా విఫలమైన బెంగళూరు బ్యాటింగ్
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు మంచి ఆరంభమే లభించింది. విరాట్ కోహ్లీ (39: 33 బంతుల్లో, ఐదు ఫోర్లు), దేవ్‌దత్ పడిక్కల్ (21: 18 బంతుల్లో, రెండు ఫోర్లు) ఐదు ఓవర్లలోనే మొదటి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అయితే ఆరో ఓవర్ మొదటి బంతికి దేవ్‌దత్ పడిక్కల్ అవుటయ్యాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ బాగా నెమ్మదించింది. ఇన్నింగ్స్ పదో ఓవర్లో భరత్ (9: 16 బంతుల్లో) కూడా అవుటయ్యాడు. దీంతో పది ఓవర్లలో బెంగళూరు రెండు వికెట్లు నష్టపోయి 70 పరుగులు చేసింది.


ఆ తర్వాత కూడా బెంగళూరు ఇన్నింగ్స్ మందకొడిగానే సాగింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో కోహ్లీ కూడా అవుట్ కావడంతో బెంగళూరు కష్టాలు రెట్టింపయ్యాయి. డివిలియర్స్ (11: 9 బంతుల్లో, ఒక ఫోర్), మ్యాక్స్‌వెల్ (15: 18 బంతుల్లో, ఒక ఫోర్) కూడా విఫలం అయ్యారు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 138 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ నాలుగు వికెట్లు, లోకి ఫెర్గూసన్ రెండు వికెట్లు తీసుకున్నారు.


ఆటనే మార్చేసిన నరైన్
ఇక కోల్‌కతా ఇన్నింగ్స్ కూడా కాస్త మెల్లగానే ప్రారంభం అయింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (29: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు), వెంకటేష్ అయ్యర్ (26: 30 బంతుల్లో, ఒక సిక్సర్) మెల్లగానే ఆడటంతో కోల్‌కతా మొదటి ఐదు ఓవర్లలో 40 పరుగులు చేసింది. బెంగళూరు తరహాలోనే ఇన్నింగ్స్ ఆరో ఓవర్లోనే కోల్‌కతా కూడా మొదటి వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే ఫాంలో ఉన్న రాహుల్ త్రిపాఠి (6: 5 బంతుల్లో, ఒక ఫోర్) కూడా అవుటయ్యాడు. దీంతో కోల్‌కతా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా కోల్‌కతా ఇన్నింగ్స్ మెల్లగానే నడిచింది. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా రెండు వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది.


ఆ తర్వాత 11వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ అవుటయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన సునీల్ నరైన్ (26: 15 బంతుల్లో, మూడు సిక్సర్లు) మ్యాచ్‌ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడాడు. డాన్ క్రిస్టియన్ బౌలింగ్‌లో తను ఎదుర్కున్న మొదటి మూడు బంతులను సిక్సర్లుగా తరలించాడు. దీంతో ఆ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. అక్కడ మ్యాచ్ పూర్తిగా కోల్‌కతా చేతుల్లోకి వచ్చింది. ఆ తర్వాత కీలక బ్యాట్స్‌మెన్ అందరూ అవుట్ అయినా.. సాధించాల్సిన లక్ష్యం తక్కువ ఉండటంతో బెంగళూరు బౌలర్లు పొదుపుగా బౌలింగ్ వేసినా ఉపయోగం లేకపోయింది. 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి కోల్‌కతా లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, హర్షల్ పటేల్, చాహల్ తలా రెండు వికెట్లు తీశారు.


Also Read: డేవిడ్‌ వార్నర్‌ అంశంలో గుసగుసలెందుకు? ఏదో జరుగుతోందని సంజయ్‌ మంజ్రేకర్‌ అనుమానం!


Also Read: మెస్సీ.. ఏడోసారి గెలుస్తాడా? రొనాల్డోతో పోటీపడుతున్న అర్జెంటీనా దిగ్గజం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి