ఐపీఎల్‌లో డేవిడ్‌ వార్నర్‌ గణాంకాలు చూస్తే దిమ్మతిరుగుతుందని మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. కొన్నేళ్లుగా అతడు సన్‌రైజర్స్‌ హైదరాబాదుకు అద్భుతంగా ఆడాడని పేర్కొన్నాడు. ఏ ఆటగాడికైనా ఫామ్‌లేమి సుదీర్ఘ కాలం ఉండదని వెల్లడించాడు. డేవీ విషయంలో క్రికెటేతర కారణాలేవో ఉన్నాయని అంచనా వేశాడు.


Also Read: చితక్కొట్టిన శ్రీకర్‌.. ఆఖరి బంతికి సిక్సర్‌తో దిల్లీకి షాక్‌


'కొన్నేళ్లుగా వార్నర్‌ గణాంకాలు చూస్తే దిమ్మ తిరుగుతుంది. సుదీర్ఘ కాలం చూసుకుంటే ఐపీఎల్‌లో అత్యంత గొప్ప బ్యాటర్‌ అతడే. ఆ రికార్డుతో పోలిస్తే ఈ సీజన్లో అతడు ఎనిమిది మ్యాచుల్లో కేవలం 195 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్‌ తరఫున చివరి మ్యాచ్‌ ఆడేశానని అతడు ఇన్‌స్టాలో సూచన చేశాడు. అది నిజమైంది. 2013 తర్వాత డేవీ 500 పరుగులు చేయకపోవడం ఇదే తొలిసారి' అని మంజ్రేకర్‌ అన్నాడు.


'వార్నర్‌ ఫామ్‌లేమి ఎక్కువ రోజులు ఉండదు. అందుకే బ్యాటింగ్‌ ఫామ్‌ ఆధారంగా అతడిని తొలగించలేరు. మనకు తెలియని క్రికెటేతర కారణాలేవో ఉండొచ్చు. అదేంటో నాకర్థం కాలేదు. కానీ అక్కడేదో తప్పు జరుగుతోంటే ఎందుకంతా గుసగుసలు పెడుతున్నారు?' అని సంజయ్‌ ప్రశ్నించాడు.


Also Read: అంతర్జాతీయ క్రికెట్లో దూకుడు ఐపీఎల్‌లో ఎందుకు కనిపించదో..! రోహిత్‌ బ్యాటింగ్‌పై గౌతీ ఆశ్చర్యం


డేవిడ్‌ వార్నర్‌కు తుదిజట్టులో చోటివ్వని సన్‌రైజర్స్‌ యాజమాన్యం రాజస్థాన్‌ మ్యాచుకు ముందు అతడిని హోటల్లోనే వదిలేసింది. అదే విషయాన్ని అడిగితే అతడి స్థానంలో కుర్రాళ్లకు మైదానంలో సమయం గడపటం ఎలా ఉంటుందో చూపించాలని కోరినట్టు హైదరాబాద్‌ కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌ అన్నాడు. ఐపీఎల్‌లో ఐదు వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక విదేశీయుడు డేవిడ్‌ వార్నర్ మాత్రమే. 41.59 సగటుతో అతడు 5,449 పరుగులు చేశాడు.


Also Read: సన్‌రైజర్స్‌పై 42 పరుగులతో ముంబై విజయం.. అయినా లేదు ప్రయోజనం!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి