ఆఖరి లీగ్‌ మ్యాచును రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు విజయంతో ముగించింది. ఉత్కంఠ చంపేస్తున్నవేళ.. చివరి బంతిని సిక్సర్‌ బాదేసి శ్రీకర్‌ భరత్‌ (78: 52 బంతుల్లో 3x4, 4x6) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న మాక్స్‌వెల్‌ (51: 33 బంతుల్లో 8x4) అర్ధశతకంతో అతడికి అండగా నిలిచాడు. దాంతో 165 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన 7 వికెట్ల తేడాతో ఛేదించింది. అంతకు ముందు దిల్లీలో పృథ్వీ షా (48: 31 బంతుల్లో 4x4, 2x6), శిఖర్‌ ధావన్‌ (43: 35 బంతుల్లో 3x4, 2x6) రాణించారు.


Also Read: కోల్‌కతాకు దాదాపు ప్లేఆఫ్ బెర్తు.. ముంబై ఆశలు గల్లంతు..... రాజస్తాన్‌పై రైడర్స్ భారీ విజయం!


చితక్కొట్టిన శ్రీకర్‌
ఆరు పరుగుల్లోపే ఓపెనర్లు దేవదత్‌ పడిక్కల్‌ (0), విరాట్‌ కోహ్లీ (4) ఔటవ్వడంతో బెంగళూరు ఛేదన సవ్యంగా సాగలేదు. పవర్‌ప్లేలో 29 పరుగులే వచ్చాయి. ఉత్కంఠ రేకెత్తించినా కష్టతరమైన ఛేదనను శ్రీకర్‌ భరత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ పూర్తి చేశారు. ముఖ్యంగా ఆంధ్రా ఆటగాడు భరత్‌ సమయోచిత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. చక్కని సిక్సర్లు బాదేశాడు. మూడో వికెట్‌కు ఏబీ డివిలియర్స్‌ (25)తో కలిసి 49 పరుగుల భాగస్వామ్యం అందించాడు. జట్టు స్కోరు 55 వద్ద ఏబీడీని రిపల్‌ పటేల్ ఔట్‌ చేశాడు. దిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో దాడి చేస్తుండటంతో బెంగళూరు లక్ష్యాన్ని ఛేదిస్తుందా అన్న ఉత్కంఠ కలిగింది.


Also Read: ఇసుక కాదు..! చెన్నైకి కేఎల్ తుపాను సెగ! 13 ఓవర్లకే లక్ష్యం ఛేదించేసిన కేఎల్‌ రాహుల్‌


ఫామ్‌లో ఉన్న మాక్స్‌వెల్.. భరత్‌కు అండగా ఉండటంతో విజయం సాధ్యమైంది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 63 బంతుల్లో 111 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. ఆఖరి 12 బంతుల్లో 19 పరుగులు అవసరమైన వేళ.. నార్జ్‌ కేవలం 4 పరుగులే ఇచ్చాడు. దాంతో ఆఖరి ఓవర్లో బెంగళూరు 15 చేయాల్సి వచ్చింది. అవేశ్‌ తొలి ఐదు బంతుల్లో 9 పరుగులే ఇచ్చాడు. అయితే ఆఖరి బంతిని వైడ్‌ వేయడంతో నాటకీయత చోటు చేసుకుంది. ఆ  తర్వాత వేసిన బంతిని శ్రీకర్‌ అద్భుతమైన సిక్సర్‌గా మలిచి మ్యాచ్‌ను ముగించాడు.


Also Read: ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో?


ఓపెనర్ల దూకుడు
మొదట బ్యాటింగ్‌ చేసిన దిల్లీకి మంచి ఓపెనింగ్‌ లభించింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 88 పరుగులు భాగస్వామ్యం అందించారు. పది ఓవర్ల వరకు వికెట్‌ ఇవ్వలేదు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు దంచేశారు. కట్టుదిట్టంగా వేసిన బంతుల్ని గౌరవించిన ఈ జోడీ చెత్త బంతుల్ని మాత్రం వేటాడింది. వరుస బౌండరీలు సాధించింది. ఐతే 11 ఓవర్‌ తొలి బంతికి గబ్బర్‌ను హర్షల్‌ పటేల్‌ పెవిలియన్‌ పంపించాడు. మరికాసేపటికే అర్ధశతకానికి చేరువైన షాను చాహల్‌ ఔట్‌ చేశాడు. అప్పటికి దిల్లీ స్కోరు 101-2. ఏడు పరుగుల వ్యవధిలోనే రిషభ్ పంత్‌ (10) ఔటైనా.. ఆఖర్లో శ్రేయస్‌ అయ్యర్‌ (18), హెట్‌మైయిర్‌ (29) ఫర్వాలేదనిపించారు. స్కోరును 164-5కు చేర్చారు. డెత్‌ ఓవర్లలో బెంగళూరు బౌలర్లు అదరగొట్టాడు. సిరాజ్‌కు 2, చాహల్‌, హర్షల్‌, క్రిస్టియన్‌కు తలో వికెట్‌ తీశారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి