ఐపీఎల్‌లో నేడు సాయంత్రం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్‌ను కోల్‌కతా 86 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో రేపటి మ్యాచ్‌లో ముంబై భారీ తేడాతో గెలిస్తే తప్ప.. కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం దాదాపు భాయమే. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా, రాజస్తాన్ 16.1 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌటైంది.


అత్యంత పేలవంగా..
ఇక రాజస్తాన్ ఇన్నింగ్స్ మరింత పేలవంగా మొదటి ఓవర్‌లో యశస్వి జైస్వాల్, రెండో ఓవర్ మొదటి బంతికి సంజు శామ్సన్ అవుట్ కావడంతో రాజస్తాన్ ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం ఎక్కడా ఆగలేదు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో లోకి ఫెర్గూసన్ లియామ్ లివింగ్ స్టోన్, అనూజ్ రావత్‌లను అవుట్ చేసి రాజస్తాన్‌ను పూర్తిగా కష్టాల్లోకి నెట్టాడు. ఆ తర్వాత కూడా వికెట్లు వరుసగా పడుతూనే ఉన్నాయి. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్, శివం దూబే, ఎనిమిదో ఓవర్లో క్రిస్ మోరిస్ అవుట్ కావడంతో రాజస్తాన్ 35 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఐపీఎల్‌లో అత్యంత తక్కువ స్కోరు(49 - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) రికార్డు ఈ మ్యాచ్‌లో బద్దలవుతుందేమో అనిపించింది.


ఈ దశలో రాహుల్ టెవాటియా.. టెయిలండర్లతో కలిసి రాజస్తాన్ స్కోరును కాస్త ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. శివం మావి బౌలింగ్‌లో రాహుల్ టెవాటియా క్లీన్ బౌల్డ్ కావడంతో రాజస్తాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 16.1 ఓవర్లలో 85 పరుగులకు రాజస్తాన్ ఆలౌట్ అయింది. దీంతో 86 పరుగులతో కోల్‌కతా విజయం సాధించింది. కోల్‌కతా బౌలర్లలో శివం మావి నాలుగు వికెట్లు, లోకి ఫెర్గూసన్ మూడు వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్‌లకు చెరో వికెట్ దక్కింది.


ఈసారీ ఓపెనర్లే..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్ కాస్త మందకొడిగా ప్రారంభం అయింది. పిచ్ సహకరించకపోవడంతో కోల్‌కతా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (56: 44 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), వెంకటేష్ అయ్యర్  (38: 35 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) కాస్త నిదానంగా ఆడారు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి కోల్‌కతా వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా పెద్దగా పరుగులు రాలేదు. పరుగులు రాకపోయినా వికెట్లు పడకపోవడంతో కోల్‌కతా పెద్దగా ఒత్తిడికి లోనవ్వలేదు. పది ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా స్కోరు వికెట్ నష్టపోకుండా 69 పరుగులకు చేరుకుంది.


అయితే ఆ తర్వాత కోల్‌కతా ఇన్నింగ్స్ వేగం పుంజుకుంది. దీంతోపాటే వరుస విరామాల్లో వికెట్లు కూడా పడ్డాయి. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్, 12వ ఓవర్లో ఫాంలో ఉన్న నితీష్ రాణా (12, 5 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) అవుటయ్యారు. శుభ్‌మన్ గిల్ గేర్ మార్చడం, రాహుల్ త్రిపాఠి (21: 14 బంతుల్లో, మూడు ఫోర్లు) మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడటంతో స్కోరు పరుగులు పెట్టింది. శుభ్‌మన్ గిల్ తన అర్థసెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో 15 ఓవర్లకు చెన్నై స్కోరు 127 పరుగులకు చేరుకుంది. అంటే ఐదు ఓవర్లలోనే 58 పరుగులు వచ్చాయన్న మాట. అయితే ఇన్నింగ్స్ 16వ ఓవర్లో గిల్, 18వ ఓవర్లో రాహుల్ త్రిపాఠి అవుట్ అవ్వడంతో స్కోరు వేగం కాస్త తగ్గింది. చివర్లో దినేష్ కార్తీక్ (14: 11 బంతుల్లో, ఒక సిక్సర్), ఇయాన్ మోర్గాన్ (13: 11 బంతుల్లో, ఒక ఫోర్ ఒక సిక్సర్) కాస్త వేగంగా ఆడటంతో 20 ఓవర్లలో స్కోరు 171 పరుగులకు చేరుకుంది. కోల్‌కతా బౌలర్లలో క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, రాహుల్ టెవాటియా, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.


Also Read: యాష్‌ తప్పేం చేయలేదు! సోషల్‌ మీడియాలో ఫాలోవర్లు పెంచుకొనేందుకే అతడిపై విమర్శలు.. గౌతీ సీరియస్‌!


Also Read: విరాట్‌ సరసన స్మృతి మంధాన.. పింక్‌ టెస్టులో సెంచరీ. ఔటివ్వకున్నా పెవిలియన్‌ వెళ్లిన పూనమ్‌!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి